నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వైద్య విభాగం
యైటింక్లయిన్‌కాలనీ,(ఆరోగ్యజ్యోతి): ‘మీ ఆరోగ్యం.. మా బాధ్యత’ అనే భావనతో సింగరేణి ఆర్జీ-2 వైద్య విభాగం నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరోగ్య పరంగా ఉద్యోగులను, మాజీ ఉద్యోగులను, కార్మికుల కుటుంబ సభ్యులను అనుక్షణం అప్రమత్తం చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పించేందుకు చరవాణి ఆధారంగా ‘సందేశం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. మానవ శరీరంలోని అవయవాలు, వాటి పనితీరు, వాటి సంరక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు వంటి అనేక సందేశాలను చిన్న నిడివితో ఉన్న వీడియోలను వాట్సాప్‌లో పంపిస్తోంది. తద్వారా ఆర్జీ-2, 3 డివిజన్ల పరిధి ఉద్యోగులను ఆరోగ్యం అనే బాటలోకి రప్పించే ఏర్పాట్లు చేశారు.
ఆ ఆలోచనతో అడుగు పడింది
గత నెలలో యైటింక్లయిన్‌కాలనీలోని సింటార్స్ శిక్షణ కేంద్రంలో 17వ రక్షణ త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ‘సింగరేణిలో ప్రమాదాలు తగ్గాయి.. సాధారణ మరణాలు మాత్రం పెరుగుతున్నాయం’టూ అధికారులు, గనుల భద్రత విభాగం సంచాలకులు శ్యామ్మిశ్రా దృష్టికి తెచ్చారు. ఈ విషయంలో స్పందించిన ఆయన చరవాణి వినియోగించుకోవడం ద్వారా ఉద్యోగులను, మాజీ ఉద్యోగులను, మహిళలను గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, మూత్రపిండ, నేత్ర సంబంధిత వ్యాధుల విషయంలో ఎందుకు అప్రమత్తం చేయకూడదంటూ ప్రశ్నించారు. దీంతో డైరెక్టర్ సూచన ప్రకారం తక్షణమే స్పందించిన ఆర్జీ-2 యాజమాన్యం ఈ నెల 1న డివిజన్లో ఉన్న 4600 మంది ఉద్యోగులతో పాటు ఆర్జీ-3, ఏఎల్పీ పరిధిలోని పలు విభాగాల్లో సమస్యాత్మక ఉద్యోగులను, మాజీ ఉద్యోగులను 1108 మందిని గుర్తించారు. వీరిలో వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులతో నిత్యం మందులు వాడుతున్న వారిని ‘హెల్త్ అవేర్నెస్’ అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి చేర్చారు. వీరికి అనవసర సందేశాలు కాకుండా ఆరోగ్య సంరక్షణ చిట్కాలు, వాయిస్ సందేశం, చిన్న నిడివి ఉన్న వీడియోలు పంపిస్తున్నారు. అలాగే ఏ ఉద్యోగి ఎప్పుడు మందులు తీసుకోవాలి? తీసుకున్న మందులను సమయానికి వాడుతున్నారా..? తదితర విషయాలపై స్వయంగా మెడికల్ సూపరిండెంట్ రమేష్‌బాబు ఆరా తీస్తున్నారు.
బాధ్యతగా భావించి చేపట్టాం: రమేష్‌బాబు, మెడికల్ సూపరిండెంట్
ఉద్యోగుల ఆరోగ్యం మా బాధ్యతగా భావించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో కొంత మంది నిత్యం మందులు వాడే వారు. కొంత మంది మందులు తీసుకునేవారు. మరికొందరు తీసుకునేవారు కాదు. ప్రస్తుతం ప్రతి ఉద్యోగి మందులు ఖచ్చితంగా తీసుకోవాలనే విధంగా గ్రూప్ తయారు చేశాం. ఎవరు మందులు తీసుకోకపోయినా వారిని చరవాణి ద్వారా అప్రమత్తం చేస్తాం. అలాగే క్యాన్సర్, మూత్రపిండ, గుండె, మధుమేహం దినోత్సవాల్లో వీడియో సందేశాలతో రోగులను చైతన్యం చేస్తున్నాం. స్వయంగా జీఎంతో పాటు వైద్యనిపుణులను ఈ గ్రూపులో సభ్యులుగా చేర్చి సందేశాలతో సంపూర్ణ ఆరోగ్యం కోసం కృషి చేస్తున్నాం.
వారానికి ఒక వైద్యుడితో వీడియో సందేశం
ఒక్కో విభాగానికి చెందిన ఒక్కో వైద్యుడితో వారానికి ఒకటి చొప్పున వీడియో సందేశాలను వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఏమైనా సందేహాలుంటే సదరు వైద్యుని చరవాణి నెంబరు ఇస్తూ సందేహాలు నివృత్తి చేస్తున్నారు. రోగుల పర్సనల్ రికార్డులను అమలు చేస్తూ వారు ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ విషయంలో డివిజన్లోని ఓసీపీ-3, వకీలుపల్లె, జీడీకే-7 ఎల్ఈపీ, ఆర్జీ-2 వర్క్‌షాప్, స్టోర్, సివిల్ విభాగాలకు చెందిన సంక్షేమాధికారులను ఉద్యోగుల పరంగా పూర్తి బాధ్యత వహించేలా జీఎం ఆదేశాలు జారీ చేశారు.