[spt-posts-ticker]

అద్దె గర్భ నియంత్రణ బిల్లుకు సవరణలు

సెలెక్ట్‌ కమిటీ సిఫార్సులన్నీ పరిగణనలోకి
కేంద్ర మంత్రివర్గం నిర్ణయం

దిల్లీ(ఆరోగ్యజ్యోతి): అద్దెగర్భం బిల్లుకు రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈమేరకు అద్దె గర్భాల నియంత్రణ బిల్లు-2019లో మార్పులు చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ మేరకు నిర్ణయించింది. ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును రాజ్యసభ సెలెక్ట్‌ కమిటీకి పంపించింది. బిల్లులో కొన్ని మార్పులు చేయాలని సెలెక్ట్‌ కమిటీ సూచించిందని, వీటన్నింటినీ ఆమోదించామని కేంద్రమంత్రులు ప్రకాశ్‌ జావడేకర్‌, స్మృతి ఇరానీలు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు.

అద్దెగర్భం ధరించడానికి సమీప బంధువులే ఉండాలన్న నిబంధనను తొలగించి దాని స్థానంలో ఇష్టపూర్వకంగా ముందుకొచ్చే ఏ మహిళ సేవలనైనా ఉపయోగించుకోవడానికి వీలు కల్పించారు.
వితంతువులు, విడాకులు తీసుకున్న మహిళలు కూడా అద్దెగర్భ ప్రయోజనం పొందేందుకు వీలుకల్పించారు.
ఇలా గర్భం మోసే మహిళలకు ఇచ్చే బీమా కవరేజీని 16 నెలల నుంచి 36 నెలలకు పెంచారు.
వైద్యపరమైన అవసరాలున్న భారతీయ దంపతులు, జన్మతః భారతీయులైన దంపతులు కూడా ఈ ప్రయోజనం ఉపయోగించుకోవచ్చు.
ఈ చట్టం ద్వారా ఏర్పాటయ్యే జాతీయ స్థాయి, రాష్ట్రస్థాయి బోర్డుల కాల పరిమితిని ఏడాదికి బదులుగా మూడేళ్లకు పెంచారు.

రూ.1,480 కోట్లతో నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటు
టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ రంగంలో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా కేంద్ర మంత్రివర్గం రూ.1,480 కోట్లతో నేషనల్‌ టెక్నికల్‌ టెక్స్‌టైల్‌ మిషన్‌ ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఈ మిషన్‌ కాలపరిమితి 2020-21 నుంచి 2023-24 వరకు ఉంటుంది. ఈ టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ను వ్యవసాయం, రహదారులు, రైల్వేట్రాక్‌లు, సాఫ్ట్‌వేర్‌,వైద్య-ఆరోగ్యం, బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, అగ్నినిరోధక జాకెట్లు, రోదసీ ప్రయోగాల్లో ఉపయోగిస్తారు. ఉన్నత విద్యా సంస్థల్లోనూ ఇక మీదట టెక్నికల్‌ టెక్స్‌టైల్స్‌ కోర్సులు ప్రవేశపెడతారు.
కేంద్ర చట్టాలన్నీ జమ్మూ-కశ్మీర్‌లో అమలయ్యేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది.
ఇరాన్‌లోని ఛాబహార్‌లో చేపట్టిన నౌకాశ్రయం పనులను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నౌకాశ్రయాన్ని ప్రభుత్వ రంగ సంస్థల విభాగం మార్గదర్శకాల నుంచి మినహాయించింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *