[spt-posts-ticker]

అప్రమత్తం..కట్టుదిట్టం

సిటీబ్యూరో : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా (కొవిడ్‌-19) వైరస్‌ ప్రభావం హైదరాబాద్‌పై పడకుండా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. వైద్య బృందాలను ఈ మేరకు అప్రమత్తం చేసింది. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నది. విదేశీ ప్రయాణికుల నుంచి ముప్పు పొంచి ఉన్నా ఇప్పటి వరకు ఇక్కడి వారికెవరికీ కరోనా వైరస్‌ సోకలేదు. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారే అనారోగ్యానికి గురయ్యారు. ఇంతగా గగ్గోలు పెడుతున్నప్పటికీ వచ్చిన ఏకైక పాజిటివ్‌ కేసును సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఆ రోగి కూడా కోలుకోవడంతో ఇంటికి పంపారు.

మరో పాజిటివ్‌ కేసు నమోదైనప్పటికీ ఎలాంటి భయాందోళన అవసరం లేదని ఏర్పాట్లే చెబుతున్నాయి. గాంధీ దవాఖాన వైద్య బృందం కరోనా వైరస్‌ పాజిటివ్‌ రోగికి సమర్ధవంతంగా చికిత్స చేశారు. ఈ క్రమంలోనే ఏ ముప్పు తలెత్తినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లను చేసింది. గాంధీ దవాఖానతో పాటు ఏకంగా నగరంలోనే 40 సర్కారీ, ప్రైవేటు దవాఖానల్లో ప్రత్యేక కేంద్రాలను సిద్ధంగా ఉన్నాయి. వైరస్‌ లక్షణాలు రాగానే సదరు కేంద్రానికి వెళితే వెంటనే వైద్య పరీక్షలు చేపడుతారు. ఈ మేరకు చికిత్స చేసి ఇంటికి పంపే ఏర్పాట్లు ఉన్నాయి. కరోనా వైరస్‌ నగరానికి రాకుండా ఉండేందుకు శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగిన ప్రయాణికులను నేరుగా వికారాబాద్‌ జిల్లా అనంతగిరిలో ఏర్పాటు చేసిన కేంద్రానికి తీసుకెళ్లి అన్ని వైద్య పరీక్షలు చేయనున్నారు. కరోనా వైరస్‌ నెగిటివ్‌గా తేలిన తర్వాతే ఇంటికి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రభుత్వం హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించింది.

నెలాఖరు వరకు…

నగరంలో కరోనా కట్టడికి సర్కారు పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి నెలాఖరు వరకు రద్దీగా ఉండే సినిమా హాళ్లు, స్కూళ్లు, జూపార్కు మూసివేయనున్నారు. అలాగే శిల్పారామం, క్లబ్బులు, లామకాన్‌ కేంద్రం వంటివి సైతం మూసివేస్తున్నారు. కాగా, ఆర్టీసీ బస్సులు,  షాపింగ్‌ మాల్స్‌, మెట్రో రైళ్లు యథావిధిగా నడుస్తాయి.

 కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తే.. ఏడాది జైలు

కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే ఏడాది జైలు శిక్ష తప్పదని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం వల్ల సమాజంలో ఒక రకమైన భయాందోళన సృష్టిస్తుందని ఇది ఏమాత్రం మంచిది కాదన్నారు. ఈ నేపథ్యంలో కరోనాకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని సోషల్‌ మీడియా వేదికగా ప్రచారం చేస్తే వారిపై ఎన్‌డీఎమ్‌ఏ యాక్ట్‌ సెక్షన్‌ 54 కింద కేసును నమోదు చేస్తామన్నారు. ఈ సెక్షన్‌ కింద దాదాపు ఏడాది జైలు, జరిమానా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

కరోనా ముందస్తు జాగ్రత్తలపై విస్తృత ప్రచారం ..

కరోనా ముందస్తు జాగ్రత్తలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలో కరోనా వైరస్‌ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరిస్తున్నారు. వైరస్‌ సోకకుండా, వ్యాధి లక్షణాలను గుర్తించాలని సూచిస్తున్నారు. వ్యాధి లక్షణాలు,తీవ్రత,వ్యాధి వ్యాపించకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటున్నారు వైద్యాధికారులు. దగ్గు,జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వెంటనే వైద్యుడిని  సంప్రదించాలని సూచిస్తున్నారు. విమానంలో వారు ప్రయాణించిన విమానంతో పాటు వ్యాధి సోకిన వ్యక్తి గుర్తించి ఆయన చుట్టూ పక్కల ముందుసీట్లు, వెనక సీట్లతో పాటు వ్యాధి సోకిన వ్యక్తి అక్కడి నుంచి ట్యాక్సీలో వాడారా.. సొంత కారు వాడారా, ఏ ఆఫీస్‌, ఏ షాపింగ్‌ మాల్‌కు వెళ్లాడు..ఆ వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *