- ఆరోగ్య క్యాలెండర్‌కు రూపకల్పన
- జిల్లా దవాఖానల్లో ప్రత్యేక వార్డులు
- 24 గంటల్లో నిర్ధారణ పరీక్షల వ్యవస్ హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విస్తరించకుండా ఉండేందుకు రాష్ట్ర వైద్య విభాగాలు ప్రత్యేక దృష్టి నిలిపాయి. ఎవరికైనా స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు నిర్ధారణ అయిన వెంటనే వారికి చికిత్స అందించి ప్రాణాలు కాపాడటమే కాకుండా ఇతరులకు వ్యాపించకుండా కృషి జరుపుతున్నారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పుల కారణంగా విస్తరించే సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్యవిభాగాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాయి. ఆయా సీజన్లలో విస్తరించే వ్యాధులు, వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజారోగ్య విభాగం ఆరోగ్య క్యాలెండర్‌ను రూపొందించింది. ఈ మేరకు జిల్లాలవారీగా ఈ ఆరోగ్య క్యాలెండర్ ప్రకారం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. గత నవంబర్ నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పెరిగే హెచ్1ఎన్1 కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ముందస్తు అంచనాతో వైద్యారోగ్యశాఖ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ అదుపులో ఉన్నది. ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల కారణంగా స్వైన్‌ఫ్లూ బారిన పడేవారి సంఖ్య గతేడాదితో పోల్చితే ఈసారి తక్కువగా నమోదయింది. రాష్ట్రంలోని జిల్లా దవాఖానల్లో స్వైన్‌ఫ్లూ బాధితులకు చికిత్స అందించేందుకు ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుచేశారు. ఎంపికచేసిన సర్కారు దవాఖానల్లో ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డులు ఏర్పాటుచేసి 24 గంటల్లోనే స్వైన్‌ఫ్లూ నిర్ధారణ పరీక్షలు చేసే వ్యవస్థను ఏర్పాటుచేశారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో బాధపడేవారి నుంచి శాంపిళ్లను తీసుకొని హైదరాబాద్‌లోని ఐపీఎంకు పంపించాలని జిల్లా దవాఖానలను ఆదేశించింది. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక నోడల్ టీంను కూడా ఏర్పాటుచేశారు.
అందుబాటులో మందులు
స్వైన్‌ఫ్లూను ఎదుర్కొనేందుకు వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని 39 దవాఖానల్లో వైద్యసేవలు అందించేందుకు 487బెడ్లతో ప్రత్యేక వార్డులను ఏర్పాటుచేశారు. అలాగే ఒసాల్డోవీర్ యాంటీవైరల్ క్యాప్సూల్స్, సిరప్‌లను అందుబాటులో ఉంచారు. వీటితోపాటు యాంటీ స్వైన్‌ఫ్లూ పిడియాట్రిక్ సిరప్, డబుల్ ప్రొటెక్షన్ మాస్క్‌లు, హెచ్1ఎన్1 నిర్ధారణ కిట్లు, వైరల్ ట్రాన్స్‌పోర్టు మీడియా కిట్లు, శానిటైజర్లను కూడా సరఫరా చేశారు. వైద్య విభాగాలు చేపడుతున్న ముందస్తు చర్యల కారణంగా రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ బారిన పడుతున్నవారి సంఖ్య ఏటా తగ్గుముఖం పడుతున్నదని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్యశాఖ గత నవంబర్ నెలలో వెల్లడించిన గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి.
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]