[spt-posts-ticker]

అమెరికాలో రోజుకు 2 వేల మృతులు

వాషింగ్టన్‌, ఏప్రిల్‌ 9 : కరోనా అంటే గుర్తొచ్చేవి స్పెయిన్‌, ఇటలీ. పదివేల మరణాలు తొలిగా చోటుచేసుకొన్న యూరప్‌ దేశాలివి. ఇప్పుడు ఈ లెక్కలనూ అమెరికాలో కరోనా విలయం దాటేస్తోంది. యూర్‌పలోని ఏ దేశంలోనూ ఒకే రోజు మరణాలు వెయ్యి దాటలేదు. కానీ, అమెరికాలో దాదాపు రెండు వేలమంది చొప్పున వరుసగా రెండురోజులు చనిపోవడంతో అక్కడ మరణాలు 16,074కు చేరుకొన్నాయి. దీంతో, 15,238 మరణాలు చోటుచేసుకొన్న స్పెయిన్‌ను మించిన విషాదం అమెరికాలో అలుముకొంది. అందులోనూ న్యూయార్క్‌లో శవాలు గుట్టలు పడుతున్నాయి. 731 మంది మృతితో ఒకరోజు అత్యధిక మరణాలు సోమవారం చోటుచేసుకోగా, బుధవారం సంభవించిన 779 మరణాలు ఆ పాత లెక్కలను తుడిపేశాయి. కుప్పలుతెప్పలుగా వచ్చిపడిన పాజిటివ్‌ కేసులను చూడటానికి ఆస్పత్రులు చాలడం లేదు.

24 గంటలూ పోరాడుతున్న వైద్యులకు వ్యక్తిగత రక్షణ పరికరాలను ప్రభుత్వం సరిపడా అందించలేకపోతోంది. వందల్లో చనిపోతున్న పౌరులను పూడ్చడానికి న్యూయార్క్‌, న్యూజెర్సీ లాంటి హాట్‌స్పాట్లలో సమాధి స్థలాలు సరిపోవడం లేదు. అయితే, ప్రభుత్వం కొంత ఆలస్యంగానైనా లాక్‌డౌన్‌ అమలుచేస్తూ, భౌతిక దూరాన్ని తప్పనిసరి చేయడం ఒక్కటే ఇంతటి విపత్కర వాతావరణంలోనూ ఆ దేశ పౌరులకు కొంత కవచంలా నిలిచింది. ఇదే మాట న్యూయార్క్‌ గవర్నర్‌ ఆండ్రూ క్యూమో స్పష్టం చేశారు. ఈ చర్యల వల్లే కేసులు తగ్గుతున్నాయని, ఆస్పత్రుల్లో కొత్తగా చేరేవారు కూడా తగ్గిపోయారని ఆయన వెల్లడించారు. ఇదే పరిస్థితి రెండు వారాలపాటు కొనసాగితే ఆరోగ్య వ్యవస్థను స్థిరీకరించగలుగుతామని, ఇంతటి విపత్కర వాతావరణంలోనూ కరోనా కేంద్రాలుగా మార్చిన ఆస్పత్రులను కనిష్ఠస్థాయికి తీసుకురాగలుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికి ఈ సిటీలో 6,268మంది కరోనాబారినపడి చనిపోయారు. కేసులు నాలుగు లక్షలు దాటిపోయాయి. ఇళ్లలోనే చనిపోతున్న వారినీ కలుపుకొంటే మరణాల రేటు మరింత ఎక్కువగా ఉండొచ్చునని న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డె బ్లాసియో ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌వాసుల్లో లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా సంతతివారే ఎక్కువగా చనిపోతున్నారని ప్రభుత్వ ప్రాథమిక నివేదిక తెలిపింది. చేతులు కలిపి కరచాలనం చేసే అలవాటును మునుముందు మానేయాలని అంటువ్యాధుల సంస్థ అధినేత ఆంటోనీ ఫౌసీ సూచించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *