[spt-posts-ticker]

అలుగుతో కరోనా వైరస్‌ వ్యాప్తి! –  చైనా పరిశోధనలో వెల్లడి

 

 

ప్రాణాంతకమైన కొత్తరకం కరోనా వైరస్‌ ఏ జంతువు ద్వారా వ్యాపించి ఉంటుందనే విషయంలో శాస్త్రవేత్తలు రోజుకో కొత్త విషయం చెబుతున్నారు. తొలుత ఇది పాముల ద్వారా వచ్చి ఉంటుందని, తర్వాత గబ్బిలాలే కారణమని వారు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా వారు ఈ వైరస్‌ వ్యాప్తికి అలుగు (పాంగొలిన్‌)లు కారణం కావచ్చంటున్నారు.. వీటి జన్యుక్రమాన్ని పరిశీలించినప్పుడు అది 99% వరకు కరోనా కొత్త తరహా వైరస్‌ బాధితుల నమూనాలతో సరిపోలుతోందని ‘దక్షిణ చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం’ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. చైనా మరికొన్ని దేశాల్లో వీటి మాంసాన్ని తింటారు.


కరోనాతో మరో 73 మంది మృతి

ట్రంప్‌తో మాట్లాడిన జిన్‌పింగ్‌
సమస్యపై సహేతుకంగా ఆలోచించాలని వినతి
బీజింగ్‌

కరోనా కొత్త వైరస్‌ చైనాలో ఇప్పటివరకు 31,161 మందికి సోకినట్లు అధికార వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. మృతుల సంఖ్య 636కి చేరింది. ఒక్కరోజులో 73 మంది చనిపోగా వారిలో 69 మంది ఒక్క హుబెయ్‌ ప్రావిన్సుకు చెందినవారే. వైరస్‌ సోకిందనే అనుమానంతో ఆస్పత్రుల్లో చేరినవారి పరిస్థితి క్రమేపీ

మెరుగుపడుతోంది. ఇంతవరకు 1540 మందిని ఆస్పత్రుల నుంచి ఇళ్లకు పంపించారు. మరో నవజాత శిశువులో ఈ వైరస్‌ బయటపడింది. ఐరోపా దేశాల్లో వైరస్‌ సోకినవారి సంఖ్య 31కి చేరింది. తాను పరీక్షించిన రోగుల్లో కరోనా తరహా వైరస్‌ లక్షణాలు కనిపించాయని డిసెంబరులోనే హెచ్చరించిన 34 ఏళ్ల వైద్యుడు గురువారం అదే వైరస్‌తో ప్రాణాలు కోల్పోయిన వైనంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఆయన మరణంపై సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున సానుభూతి వ్యక్తమవుతోంది. ఆయన అప్రమత్తతను పలు పత్రికలు కొనియాడాయి.

‘పీపుల్స్‌ వార్‌’ను గమనించండి
కరోనా వైరస్‌ వ్యాప్తిని, తదనంతర పరిస్థితిని ప్రశాంత చిత్తంతో, సహేతుకంగా చూడాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ విజ్ఞప్తి చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాము చేస్తున్న ప్రయత్నాలను, ప్రారంభించిన ‘పీపుల్స్‌ వార్‌’ను గమనించాలని కోరారు. శుక్రవారం ఆయన ట్రంప్‌తో మాట్లాడారు. వైరస్‌ సోకుతుందనే భయంతో విమాన సేవల్ని రద్దు చేయడంపై వివిధ దేశాల రాయబారుల వద్ద చైనా నిరసనలు తెలిపింది. ఈ చర్య ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉందంది. వైరస్‌ భయంతో పలు దేశాలు తమవద్దకు ప్రయాణికుల నౌకల్ని రానివ్వడం లేదు. జపాన్‌ తీరంలోనే నిలుపుచేసి, పరీక్షించిన నౌకలో 41 మందికి వైరస్‌ ఉన్నట్లు తేలింది. 3700 మంది ప్రయాణికులు ఈ నౌకకే పరిమితం కావాల్సి వచ్చింది.

ఇప్పుడున్న వీసాలు చెల్లవ్‌: హర్షవర్థన్‌
దిల్లీ: చైనా నుంచి ప్రయాణం చేసే విదేశీయులెవరికీ ఇప్పుడున్న వీసాలు చెల్లుబాటు కావని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్థన్‌ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. వుహాన్‌లో ఇంకా 80 మంది భారతీయులున్నారని, వారిలో 70 మంది స్వచ్ఛందంగానే అక్కడే ఉంటామన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెప్పారు.

ఎయిరిండియాకు ఉపరాష్ట్రపతి అభినందన
వుహాన్‌ నుంచి 600 మందికి పైగా భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చిన ఎయిరిండియా బృందాన్ని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభినందిస్తూ ట్వీట్‌ చేశారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *