ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ మహిళలను పట్టి పీడించేది మాత్రం మొటిమలే. కొంతమంది ముఖం చూస్తే నున్నగా, మృదువుగా ఉంటుంది. మరికొంత మందిని చూస్తే ముఖం అంతా మొటిమలతో నిండిపోయింటుంది. అసలు ఈ మొటిమలు ఎందుకు వస్తాయి? వచ్చినప్పుడు ఏం చేయాలి? అన్న విషయాలు తెలుసుకుందాం.
* చాలామంది ఫోన్‌ను ముఖానికి దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటారు. దీనివల్ల ఫోన్‌కు ఉన్న బ్యాక్టీరియా ముఖంపై చేరి మొటిమల సమస్యకు కారణమవుతుంది.
* ఫోన్‌కు చెమట అంటుకొని అది మళ్లీ ముఖానికి తాకడం వల్ల మొటిమల సమస్య మరింత అధికమవుతుంది.
* ఫోన్ మాట్లాడేటప్పుడు ముఖానికి కాస్త దూరంగా పెట్టుకొని మాట్లాడాలి. వీలైతే ఇయర్ ఫోన్స్ వాడాలి. ఎప్పటికప్పుడు ఫోన్‌ను క్లీన్ చేసుకొని మాట్లాడితే మొటిమల సమస్య నుంచి బయట పడవచ్చు.
* చర్మాన్ని స్క్రబ్ చేయడం మంచిదే. దీనివల్ల చర్మంలోని చర్మకణాలు తొలగిపోతాయి. కానీ, మొటిమల సమస్యలు ఉన్నవారు మాత్రం స్క్రబ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే స్క్రబ్బింగ్ వల్ల చర్మ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. కాబట్టి మొటిమలతో బాధపడే వారు స్క్రబ్బింగ్‌కు దూరంగా ఉండాలి.
* ముఖం కడగడం వల్ల ముఖం శుభ్రంగా ఉండడంతోపాటు మొటిమల సమస్య తగ్గుతుంది. కానీ అతిగా కడగడం లాంటివి చేస్తే చర్మంలోని సహజ నూనెలు తగ్గి సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఇలా చేయడం వల్ల ముఖంలోని సహజ తేమ తగ్గి నూనె ఉత్పత్తి పెరుగుతుంది.
* జంక్‌ఫుడ్ అధికంగా తీసుకోవడం, నిద్రలేమి, ఒత్తిడి కారణంగా కూడా మొటిమల సమస్య తీవ్రంగా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు తీసుకొని, నీటిని ఎక్కువగా తాగుతుంటే మొటిమల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.