‘అదేంటిరా అది అట్లా తింటుంది?’ అని ఆడవాళ్లు సుష్టిగా భోజనం చేయడం ఆక్షేపించేలా సమాజంలో ఎంతలా నాటుకు పోయిందో ఇటీవల విడుదలైన ‘గీత గోవిందం’ సినిమాలో డైలాగే నిదర్శనం. ‘ఆడవాళ్లు కూడా గట్టిగనే తినాలిరా! అప్పుడే వాళ్లు స్ట్రాంగ్‌గా ఉంటారు. వాళ్లు స్ట్రాంగ్‌గా ఉంటే ఇల్లు స్ట్రాంగ్‌గా ఉంటుంది.. ఆటోమేటిక్‌గా సొసైటీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటుంది’ అంటూ ఈ సందర్భంగా హీరోతో చెప్పించిన మాటలు అక్షర సత్యాలు. అందరికీ ఆహారాన్ని సమకూర్చి, వారి ఆకలి తీర్చే ఆమెకు మాత్రం తగినంత పోషకాహారం లేకుండా పోయింది. సామాజిక వివక్ష, అంతులేని పనిభారం, ఆమె ఆరోగ్యంపై వెంటాడే నిర్లక్ష్యం.. మహిళలు పురుషులతో సమానం కారనే తిరోగమన భావజాలం.. ఆమెను పోషకాహారానికి దూరం చేస్తూ.. రకరకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. గతేడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే వివరాలను పోషకాహార నివేదికలో వెల్లడిస్తూ.. ప్రపంచంలో అత్యధికంగా పోషకాహారానికి దూరమైన మహిళలు మనదేశంలోనే ఉన్నారని పేర్కొంది. ఇది ఎంతో దిగ్భ్రాంతి కలిగించే అంశం. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి జాతీయ పోషకాహార వారోత్సవాలు మొదలవుతున్నాయి. ఈ తరుణంలో పోషకాహారం అంటే ఏమిటి? దాని లోపం వల్ల మహిళలకు కలిగే ఆరోగ్య సమస్యల గురించి ఈ వారం ‘డాక్టర్ స్పెషలిస్ట్’లో తెలుసుకుందాం!
సంధ్య ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆరోజు ఆఫీసుకు వెళ్లడానికి ఆమెకు ఓపిక లేదు. కొన్ని రోజులుగా ఇలానే అవుతోంది. ఎప్పుడు ఆదివారం వస్తుందా? కాస్త విశ్రాంతి తీసుకుందామా?! అనే అనిపిస్తోందామెకు. భరించలేనంత నిస్సత్తువ వెంటాడుతుండడంతో ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్ ఆమెకు పోషకాహారలోపం వల్లే ఈ సమస్య వచ్చిందని చెప్పారు.
లాస్య డిగ్రీ చదువుతోంది. కాలేజీ బస్సు అందదేమో అన్న భయంతో కొన్నిసార్లు బ్రేక్‌ఫాస్ట్ కూడా చేయకుండానే వెళ్ళిపోతుంటుంది. తల్లి ఇచ్చిన లంచ్ బాక్స్‌లోని ఆహారమూ సరిగ్గా తినదు. ఫలితంగా నీరసానికి గురై, చదువుమీద ఆసక్తి కోల్పోతోంది. బలహీనంగా మారింది.
రాగిణి తొమ్మిదోనెల గర్భిణి. భర్త, తల్లిదండ్రులు ఆమెకు ఇవ్వాల్సిన పోషకాహారంపై తగిన శ్రద్ధ చూపించరు. ఫలితంగా ప్రసవ సమయంలో ఆమె పడిన బాధ వర్ణనాతీతం. సిజేరియన్తో పుట్టిన శిశువు తగినంత బరువు లేక కొన్ని గంటలకే చనిపోయింది.
… ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రంగంలోఉన్నాగానీ, మహిళలకు అవసరమైనంత పోషకాహారం అందడం లేదనే వాస్తవం మాత్రం తేటతెల్లం.
సామాన్య, మధ్య తరగతి కుటుంబాల్లో నెలకొన్న సామాజిక జీవన ప్రమాణాలు, ఆర్థిక సమస్యలు మహిళలకు పోషకాహారాన్ని అందకుండా చేసి, వారిని రకరకాల వ్యాధులకు గురిచేస్తున్నాయి. ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక ఉన్నదాంట్లోనే సర్దుకుపోవాలని సగటు మహిళ భావిస్తోంది. ఇంట్లో అందరూ తినగా మిగిలిందేదో తాను తింటోంది. ఫలితంగా చాలామంది మహిళలు పోషకాహారలేమితో బాధపడుతున్నారు. పోషకాహార లోపంతో సంభవించే వ్యాధుల్లో ఎనీమియా (రక్త హీనత), రక్తపోటు వంటివి మహిళలను చాలా వేగంగా మరణానికి చేరువ చేస్తున్నాయి. ప్రపంచం మొత్తంమీద రక్తహీనతతో బాధపడే మహిళలు మనదేశంలోనే అధికంగా ఉన్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. మహిళలు, బాలికల్లో 60 శాతం మందికి పైగా రక్తహీనతతో బాధపడుతున్నారు.
రక్తహీనత (ఎనీమియా)
ఎనీమియాకు గురైన వారిలో రక్తంలోని ఎర్రరక్తకణాలు బాగా తగ్గిపోతాయి. దీనివల్ల శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు. దాంతో రకరకాల సమస్యలు తలెత్తుతాయి.
రకాలు
రక్తహీనతలో చాలా రకాలున్నా సాధారణంగా ఏర్పడే ఎనీమియా ఐరన్ లోపం వల్ల ఏర్పడేదే. అంటే ఆహారం ద్వారా ఐరన్ లభించకపోవడం లేదా శరీరంలోని కణాలు ఆహారంలోని ఐరన్‌ని శోషించలేకపోవడంచవల్ల ఈ రకం ఎనీమియా ఏర్పడుతుంది. విటమిన్ బి12, ఫోలిక్ ఆమ్లం లోపంతోనూ ఎనీమియా వస్తుంది. కొన్నిసార్లు చాలా అరుదుగా ఇది వంశపారంపర్య రక్త సంబంధిత జబ్బుగా, జన్యు సంబంధమైన కారణాల వల్ల రావచ్చు. సిక్ సెల్ ఎనీమియా, అప్లాస్టిక్ ఎనీమియా, తలసేమియా వంటివి దీనికి ఉదాహరణలు.
కారణాలు
ఎనీమియాకున్న మూడు ముఖ్యమైన కారణాల్లో అతి ముఖ్యమైనది పోషకాహార లోపమే. మిగిలిన రెండూ రక్తం ఉత్పత్తిలో ఆటంకాలు ఏర్పడడం, రకాన్ని నష్టపోవడం వంటివి. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అనే తేడా లేకుండా పోషకాహార లోపం తీవ్రంగా ఉంది. పేదలకు పోషకాహారం తగినంతగా లభించడం లేదు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది దీనితో బాధపడుతున్నారు. పట్టణ ప్రాంతాలవారు ఇనుము, బి12 విటమిన్ లోపం ఉన్న ఆహారాలు ఎక్కువ తింటున్నారు. ఆకుకూరలు వాడకం తగ్గించి, పాలు కాకుండా టీ, కాఫీలు ఎక్కువ తాగుతున్నారు. బాగా పాలిష్ చేసిన బియ్యం, రిఫైన్డ్ వంటనూనె, పొట్టుతీసిన పప్పుధాన్యాలు, బొంబాయి రవ్వ ఇలా పోషక పదార్థాలు లేని ఆహారం తిని, రక్తహీనతకు చేరువవుతున్నారు. ఎక్కువగా బేకరీ, ఫాస్ట్ఫుడ్లు తినడంవల్లా ఈ సమస్య తలెత్తుతోంది. కొంతమంది మహిళలు డైటింగ్ పేరిట సరిగ్గా భోజనం చేయకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడంతో రక్తహీనతకు గురవుతున్నారు.
లక్షణాలు- నిర్ధారణ
ఇది వ్యాధికాదు పోషకాహార లోపం వల్ల తలెత్తే అనారోగ్య లక్షణాల్లో ఒకటి కావడం వల్ల మొదట్లో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించవు. క్రమంగా ఎనిమిక్‌గా ఉన్నవారు త్వరగా అలసి పోవడం, శ్వాస పీల్చడంలో ఇబ్బందిపడతారు. ఈ దశలో దీనిని గుర్తించకపోతే ఇతర లక్షణాలు బయటపడతాయి. గుండె దడ, తలనొప్పి, తలదిమ్ముగా ఉండడం, చెవులలో హోరు శబ్ధం విన్పించడం, కాళ్ళు పీకడం. చర్మం, చేతిగోళ్లు పాలిపోయినట్లు ఉంటాయి. జుట్టు ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు రక్త పరీక్ష చేసి, దీనిని నిర్ధారిస్తారు.
చికిత్స
రక్తహీనతకు చికిత్సను ఐరన్ మాత్రలతో ప్రారంభిస్తారు. అయితే ఐరన్ మాత్రే కదా అని డాక్టర్ పర్యవేక్షణ లేకుండా సొంతంగా వీటిని వాడితే ప్రమాదం తప్పదు. శరీర ఆకారాన్ని, లక్షణాలను అనుసరించి, తగిన మోతాదులో మాత్రమే వీటిని వాడాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతో ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. యుక్త వయస్సు నుంచి సంతానం పొందే వయసులో గల స్త్రీలందరికీ ఐరన్, పోలిక్‌యాసిడ్ మాత్రలు ఇవ్వాలి. రక్తహీనతకు తేలికగా గురయ్యే గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలకు ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు ఇవ్వాలి.
ఇంకెన్నో సమస్యలు
పోషకాహార లేమివల్ల మహిళల్లో ఇంకెన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిలో చిన్న వయసు నుంచే గ్యాస్టిక్ ట్రబుల్, కడుపు నొప్పి, మంట ఎక్కువగా ఉండడం. పోషకాహార లోపం వల్ల హార్మోన్ల సమస్యతో 8, 9 సంవత్సరాలకే రుతుస్రావం ప్రారంభం కావడం, అధిక రక్త స్రావం వంటివి కలుగుతున్నాయి. మైగ్రేన్, కంటి సమస్యలు, గర్భసంచి సమస్యలు, నరాల నీరసం, రక్తపోటు, ఊబకాయం, డిప్రెషన్ వంటివాటికీ పోషకాహార లేమి సమస్యే కారణమవుతోంది.
గర్భిణీలకు సంపూర్ణాహారం అవసరం
గర్భిణీలకు మామూలు పోషక పదార్థాలు కాక పెరిగే బిడ్డ కోసం శరీరంలో వచ్చే మార్పులను అనుసరించి, సంపూర్ణాహారం చాలా అవసరం. కాన్పు తర్వాత, బిడ్డకు పాలివ్వటానికి అధిక కేలరీలు, కొన్ని ప్రత్యేకమైన లవణాలు, ఖనిజాలు, విటమిన్లు, తీసుకోవాలి. వీటిని మైక్రో న్యూట్రియంట్స్ (సూక్ష్మ పోషకాలు) అంటారు. ఈ ఆహార పదార్థాలలో ధాన్యాలు, ఆకుకూరలు, పాలతో చేసిన పదార్థాలు, పప్పులు, పండ్లు, గుడ్లు, కూరగాయలు, పాలు, మాంసం తగిన మోతాదులో తీసుకోవాలి. సమతుల్యమైన ఆహారం (బాలెన్స్డ్ డైట్) తీసుకోకపోతే బిడ్డ బరువు తక్కువగా జన్మించవచ్చు. ఆహారం ఒకేసారి కాకుండా కొద్ది కొద్ది మోతాదులో ఎక్కువసార్లు తినాలి. సాధారణంగా స్త్రీకి 2000 కేలరీలు ఆహారం అవసరం. గర్భధారణ తర్వాత అధిక కేలరీలు తీసుకోవాలి. మొదటి త్రైమాసికంలో అదనపు ఆహారం అవసరం లేదు. రెండో త్రైమాసికంలో 300 కేలరీలు, మూడో త్రైమాసికంలో 500 కేలరీల ఆహారాన్ని అదనంగా తీసుకోవాలి.
క్యాల్షియం : బిడ్డ పెరుగుదల, ఎముకల పుష్టికి క్యాల్షియం చాలా అవసరం.
1000 నుంచి 1300 గ్రాములు చొప్పున రోజుకి కావాలి. గ్లాసు పాలలో 300 గ్రాముల క్యాల్షియం లభిస్తుంది. కప్పు పెరుగులో 250 గ్రాముల క్యాల్షియం ఉంటుంది
ఇనుము : రోజుకు 30 గ్రాములు ఐరన్ అవసరం. ఇది ఎక్కువగా
ఆకుకూరలు, రెడ్‌మీట్, బీన్స్, బెల్లం, మొలకలు, ఖర్జూరంలో ఉంటుంది.
విటమిన్లు : రోజుకి 400 గ్రాములు విటమిన్ డి అవసరం. ఇది సూర్మరశ్మి, చేపల్లో లభిస్తుంది. మాంసంలో విటమిన్ బి12 ఉంటుంది. ఇదీ చాలా అవసరం.
ఫోలిక్ యాసిడ్ : మొదట మూడు నెలల్లో తప్పక తీసుకోవల్సిన ఫోలిక్ యాసిడ్ రోజుకి 1000 మిల్లీగ్రాములు తీసుకోవాలి. దీని లోపంతో నరాలకు సంబంధించిన వ్యాధులు సంభవిస్తాయి. ఆకుకూరలు, కమలాలు, ఎండిన బఠానీలు, పండ్లలో ఇది లభిస్తుంది.
మాంసకృత్తులు : రోజుకి 70 గ్రాముల మాంసకృత్తులు తినాలి. ఇవి పప్పు దినుసులు, చిక్కుళ్ళు, వేరుశనగ, బాదం, పాలు, గుడ్డు తెల్లసొన, మాంసాలలో లభిస్తాయి.
ఆహారంతో ఈ పోషకాలు అవసరమైన మోతాదులో ప్రతిరోజూ అందకపోవచ్చు. మాత్రల రూపంలోనైనా గర్భిణీలు తప్పనిసరిగా తీసుకోవాలి. వీటిని సప్లిమెంట్స్ అంటారు. రోజుకి 1000గ్రాముల క్యాల్షియం, విటమిడి డి మాత్రలు తీసుకోవాలి. ఐరన్ మాత్రలు 30 మిల్లీగ్రాముల నుంచి 100 మిల్లీగ్రాములు వరకూ ప్రతిరోజూ తీసుకోవాలి. మల్టీ విటమిన్ మాత్రలూ అవసరాన్ని బట్టి వేసుకోవాలి.
అధిగమించాలంటే ?
పోషకాహార లోపం వల్ల తలెత్తే సమస్యలను అధిగమించాలంటే తగిన ఆహార నియమాలు పాటించాలి.
– ఇనుము ఎక్కువగా లభించే ఆకుకూరలు, పొట్టుధాన్యాలు, మాంసాహారం తరచుగా తీసుకోవాలి.
– సాధారణ ఉప్పుకు బదులు ఐరన్ ఉండే ఉప్పును రోజూ వంటల్లో వాడాలి.
– తాజా కూరగాయలలో, పాలకూర, క్యారెట్, ముల్లంగి, బీట్రూట్, టమాటాలో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో భాగంగా మార్చుకోవాలి.
– ఐరన్ అధికంగా ఉండే అరటిపండు, యాపిల్, ద్రాక్ష వంటి పండ్లని తీసుకోవాలి.
– అరటిపండులో ఉండే ఫోలిక్ యాసిడ్, బి12 విటమిన్లు రక్తహీనత నివారణకు బాగా ఉపకరిస్తాయి.
– ఎండు ఫలాలు, పులుపు ఉండే పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.
– ఆకుకూరలు, పాలు, కర్జూరం, పచ్చి బఠాణీ వంటివి ఎక్కువగా తినాలి.
– రిఫైన్డ్ చేయని పదార్థాలు, ముడిబియ్యం, పొట్టుతీయని పప్పుధాన్యాలు వంటి ఆహారపదార్థాలు వాడాలి.
– మాంసాహారులు చేప, చికెన్ లివర్, పీతలు, రెడ్ మీట్ మొదలైన ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి.
– భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు తాగకూడదు.