మెదక్, (ఆరోగ్యజ్యోతి): పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలని కాకుండా జీవితంలో స్థిరపడాలనే దీర్ఘకాలిక లక్ష్యంతో చదువాలని కలెక్టర్ ధర్మారెడ్డి విద్యార్థులకు సూచించారు. సోమవారం జాతీయ నులి పురుగుల నిర్మూలన, మాస్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాలను జిల్లా కేంద్రంలోని తెలంగాణ గురుకుల పాఠశాలలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటేనే శ్రద్ధగా చదువగలుగుతారని తెలిపారు. జిల్లాలోని 60 శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారని కలెక్టర్ గుర్తు చేశారు. కావాల్సినంత ఐరన్ ఉన్న ఆహారం పదార్థాలను తీసుకోకపోవడం వల్లే ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నారు. రక్తహీనతను నివారించేందుకు ప్రభుత్వం అనీమియా ముక్తభారత్ కార్యక్రమాన్ని చేపట్టి, ప్రతి విద్యార్థికి ఐరన్ మాత్రలను పంపిణీ చేస్తుందన్నారు.
ప్రతి ఒక్కరూ ఇంటి పేరట్లో పండ్ల మొక్కలు, ఆకుకూరలు, కూరగాయల సాగు చేసుకుని స్వచ్ఛమైన ఆహారాన్ని తినాలన్నారు. నులి పురుగుల నివారణ కోసం జిల్లావ్యాప్తంగా రెండు సంవత్సరాలకు పైబడిన వారందరికీ ప్రత్యేక మాత్రలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరి చేరవన్నారు. అల్బెండజోల్, ఫైలేరియా మాత్రలను కలెక్టర్‌తో పాటు అధికారులు వేసుకున్నారు. అనంతరం విద్యార్థులకు మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ అదనపు సంచాలకులు అమర్‌సింగ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్రావుతో పాటు ఇతర వైద్యాధికారులు రమాప్రభ, సుమిత్ర, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.