కరీంనగర్ : ఆరోగ్యవంతమైన సమాజం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రత్యేకాధికారి రాజార్షి షా అన్నారు. శుక్రవారం కేంద్ర ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో స్థానిక భగవతి- అర్విన్ ట్రీ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్, జలశక్తి, పోషణ్ అభియాన్, ప్లాస్టిక్ వినియోగం తగ్గింపుపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజార్షి షా మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత, శుద్ధజలం, నాణ్యమైన పోషకాహారం అందించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయన్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లోనూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు, వేరువేరుగా తడి, పొడి చెత్త సేకరణ కోసం కృషి జరుగుతోందని, స్వచ్ఛభారత్ లక్ష్యంగా ప్రజలంతా తమవంతు సహకారం అందించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ అధికారి శ్రీనివాస్ పటేల్ మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో పిల్లలు ఎక్కువగా రక్తహీనతతో బాధపడుతున్నారని, అందుకు ప్రధాన కారణం సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడమే అన్నారు. కార్యక్రమంలో జిల్లా మహిళా, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖ సంక్షేమ అధికారి శారద, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత, స్వచ్ఛభారత్ అధికారులు రమేష్, భగవతి పాఠశాలల ఛైర్మన్ బి.రమణారావు, స్థానిక కార్పొరేటర్ తోట రాములు పాల్గొన్నారు.