[spt-posts-ticker]

ఆర్టీసీకి రోజుకు రూ.3.90కోట్ల ఆదాయం నష్టం

హైదరాబాద్‌ (ఆరోగ్యజ్యోతి) : నగరంలో అతిపెద్ద ప్రజారవాణా వ్యవస్థగా ఉన్న ఆర్టీసీలో లాక్‌డౌన్‌ వల్ల డిపోల నుంచి బస్సులు కదలడం లేదు. అత్యవసర సేవల కోసం డిపోకు ఐదు చొప్పున ఉంచిన బస్సుల్లో కొన్నింటిని వినియోగిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులను తిప్పడం వల్ల ప్రతిరోజూ రూ.3.90కోట్ల ఆదాయం వచ్చేది. ఖర్చులు మాత్రం అంతకు మించిఉండేవి. నగరంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడం వల్ల గ్రేటర్‌ ఆర్టీసీ 20 రోజులకు సుమారు రూ.78కోట్ల మేర ఆదాయం కోల్పోయింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ముగిసి కొంతకాలమైనా గడవలేదు. ఇంతలో లాక్‌డౌన్‌తో బస్సులన్నీ డిపోలకు పరిమితమయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రతి రోజూ సుమారు 30లక్షల మంది ప్రయాణించేవారు. ఆర్టీసీకి ప్రతి నెలా సుమారు రూ.117కోట్ల ఆదాయం వచ్చేది. కార్మికుల జీతాలు, డీజిల్‌ చార్జీలు, స్పేర్‌పార్ట్స్‌ ఇతర ఖర్చులు ప్రతి నెలా రూ.145కోట్లు వచ్చేవి, ఆర్టీసీకి వచ్చే ఆదాయం కంటే ఖర్చే అధికంగా ఉండేది.అయితే ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కకపోవడం వల్ల ప్రతి రోజూ రూ.3.90కోట్ల ఆదాయం నిలిచిపోయింది. ఆర్టీసీ బస్సులు తిరుగుతున్న సమయంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందులు వచ్చేవి. ప్రస్తుతం ఆ సమస్య తీవ్రమైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులు, శ్రామికులు, సిబ్బందికి జీతాల్లో కోత విధించారు. గతంలో సుమారు 55 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మెతో పలు డిపోల్లో బస్సులు సాంకేతిక ఇబ్బందులతో కదల్లేదు. మరమ్మతులకు అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను డిపోలలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. అత్యవసర సేవలకు రోజుకో బస్సును తిప్పుతున్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ కార్మికులను వివిధ ప్రాంతాల నుంచి విధుల్లోకి తీసుకెళ్లేందుకు 35 బస్సులను వినియోగిస్తున్నారు. ఫార్మా కంపెనీలు, ప్రభుత్వ ఆస్పత్రులు సైతం ఆర్టీసీ బస్సులను వినియోగించుకుంటున్నాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *