ఏటా జరుగుతున్న మరణఘోషకు చరమగీతం
జన్యు అధ్యయనంలో కొత్త పద్ధతి కనుగొన్న శాస్త్రవేత్తలు
కుక్కునూరు, (ఆరోగ్యజ్యోతి): ప్రపంచ వ్యాప్తంగా మలేరియా పెద్ద మహమ్మారి. ఏటా దాదాపు 23-24 కోట్ల మంది వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్య నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరుగుతున్న పరిశోధనల్లో సీసీఎంబీ శాస్త్రవేత్తలు జన్యు అధ్యయనంలో నూతన ఆవిష్కరణ కనుగొన్నారు.
పశ్చిమ మన్యంలోని అయిదు మండలాల్లో మలేరియా అధికం. వైద్య ఆరోగ్య శాఖ చిత్రపటంలో మలేరియా పీడిత గ్రామాలుగా 262, అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా 139 కనిపిస్తున్నాయి. ఈ గ్రామాల్లో ఏటా మలేరియా కోరలు చాస్తూనే ఉంటుంది. ఆ ప్రాంతాల్లోని వాతావరణం పరిస్థితులు అక్కడ మలేరియాను అభివృద్ధి చేసే ‘ఎనాఫిలిస్’ దోమ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
ఏటా మన్యంలో మలేరియా, ఇతర జ్వరాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ శాస్త్రవేత్తలు జన్యు విధానంలో కనుగొన్న కొత్త పద్ధతులు మలేరియాకు ముకుతాడు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలేరియా వృద్ధికి కారణమైన ప్లాస్మోడియం,ఫాల్సిపేరం జాతులకు చెందిన పరాన్నజీవుల్లో (ఎనాఫిలిస్ దోమలో ఉండే విషకారకం) వ్యాధి కారకాలు చనిపోయేందుకు జన్యువులను ప్రవేశపెట్టే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు ఇటీవల ఆవిష్కరించారు. పరాన్నజీవుల్లో ‘కణత్వఛ ఛేదన, పునర్వ్యవస్థీకరణ’ అనే పద్ధతి ద్వారా జన్యువులను ప్రవేశపెడతారు. ఇది వ్యాధి నిర్ధరణ, నివారణకు ఉపయోగపడుతుంది. ఖరీదైన పరికరాల అవసరం లేకుండానే తక్కువ ఖర్చుతో ఈ పరాన్నజీవుల్లోకి వ్యాధి కారకాలు చనిపోయేలా జన్యువులను ప్రవేశపెట్టడానికి వీలవుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
వ్యాధిని అదుపులో ఉంచుతున్నాం
మన్యంలో మలేరియా ప్రభావం అధికంగానే ఉంటుంది. జిల్లాలో 139 అత్యంత సమస్యాత్మక గ్రామాలపై నిత్యం అప్రమత్తంగానే ఉంటాం. సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన నూతన అధ్యయనం మలేరియా నివారణ, నిర్ధరణలో మంచి ఫలితాలు కనబరిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రయోగ ఫలితాలు కూడా అందుబాటులోకి వస్తే ఇక మలేరియా కనుమరుగు కావొచ్చు. – మురళీకృష్ణ, అదనపు డీఎంహెచ్వో
శ్రీరామరక్షగా చెప్పవచ్చు
మలేరియా ప్రభావం అధికంగా ఉండే మన్యం ప్రాంతానికి ఈ పద్ధతి శ్రీరామరక్షగా చెప్పవచ్చు. మలేరియా జ్వరమొస్తే ఇప్పటి వరకు నాలుగు రోజులు అత్యంత ప్రభావం గల మందులను డోస్గా వాడాల్సి వస్తుంది. అది కూడా సకాలంలో గుర్తించగలిగితే సరే. అదే ఆలస్యం చేస్తే ప్రాణాలను కోల్పోవాల్సిన ప్రమాదం ఎదురవుతోంది. నూతన పద్ధతి అమలులోకి వస్తే ఇక మలేరియా ప్రభావం అంతగా ఉండదు. నిర్ధరణ, నివారణ కూడా సులువవుతుంది