
వాషింగ్టన్: మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్ఐ) సహా పలు వైద్య పరీక్షలు చేయించుకోవడంలో వ్యక్తులకు ఇక ఏమాత్రం అసౌకర్యం కలగదు! సాగే గుణాన్ని కలిగి ఉండటంతోపాటు ధరించడానికి వీలైన సరికొత్త ఫాబ్రిక్ను ఇందుకోసం శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. సాధారణంగా ఎంఆర్ఐ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షల్లో రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) కాయిల్స్‌ను వినియోగిస్తుంటారు. అవి శరీరం నుంచి ధ్వనులు, సంకేతాలను గుర్తిస్తాయి. అయితే, ఈ కాయిల్స్ గట్టిగా ఉండటంతో స్కానింగ్ సమయంలో వ్యక్తులు ఇబ్బంది పడుతుంటారు. ఈ ప్రతికూలతను అధిగమించేందుకుగాను.. రక్షణ, వైమానిక రంగాల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతికతల స్ఫూర్తితో అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయం పరిశోధకులు సరికొత్త ఫాబ్రిక్ను తయారుచేశారు. ఆర్ఎఫ్ కాయిల్స్‌ను అందులోకి చొప్పించారు. వ్యక్తుల శరీరంపై అది ఇట్టే అమరిపోయిందని.. వారికి సౌకర్యవంతంగా ఉందని పరిశోధకులు తెలిపారు. శరీరం నుంచి ధ్వనులు, సంకేతాలను ఆర్ఎఫ్ కాయిల్స్ మరింత మెరుగ్గా గుర్తించడంలో అది దోహదపడుతోందని చెప్పారు.