మొత్తం 276 మంది ప్రవాసులకు..
కేంద్రం వెల్లడి
సైన్యంలో తొలి కేసు
దిల్లీ: ప్రవాస భారతీయుల్లో 276 మంది కరోనా బారిన పడినట్లు తేలింది. వీరిలో 255 మంది ఇరాన్‌లోని ప్రవాసభారతీయులేనని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.మురళీధరన్ చెప్పారు. 12 మంది యూఏఈలో, ఐదుగురు ఇటలీలో; హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంకల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారని బుధవారం ఆయన లోక్‌సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘ఇరాన్లో దాదాపు 6,000 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 1100 మంది యాత్రికులు. వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంతవరకు 389 మందిని ప్రత్యేక విమానాల్లో తీసుకువచ్చాం. యూఏఈలో 8 మంది ప్రవాస భారతీయులు ఇతరులతో కలవకుండా తమ ఇళ్లకే పరిమితమయ్యారు’ అని చెప్పారు. ఇరాన్ నుంచి వచ్చినవారిలో 195 మందిని రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో సైనిక వైద్య కేంద్రానికి తరలించారు.
సైనిక శిక్షణ నిలిపివేత
భారత సైన్యంలో కరోనా తొలికేసు వెలుగుచూసింది. లద్దాఖ్ స్కౌట్ రెజిమెంటుకు చెందిన 34 ఏళ్ల సైనికుడొకరు ఈ వైరస్ బారిన పడినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఇరాన్లో యాత్ర ముగించుకుని ఇంటికి చేరుకున్న ఆయన తండ్రిలో తొలుత ఈ వైరస్ బయటపడింది. ఆయన కారణంగానే సైనికుడికి ఇది సోకినట్లు తేలింది. సెలవుల్లో ఉన్న సైనికుడు తిరిగి విధులకు హాజరయ్యాక పరీక్షలు జరిపి క్వారంటైన్లో ఉంచారు. సైనికుడికి కరోనా రావడంతో అప్రమత్తమైన అధికారులు అన్నిరకాల శిక్షణ కార్యక్రమాలు, సమర క్రీడలను నిలిపివేయాలని నిర్ణయించారు.
సైనిక, పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు
కరోనా నిర్ధారణకు తొలిసారిగా రోష్ డయాగ్నస్టిక్స్ ఇండియా అనే ప్రైవేటు సంస్థను ప్రభుత్వం అనుమతించింది. దాదాపు 10 లక్షల మంది సైనికులకు, పారా మిలిటరీ బలగాలకు అత్యవసరేతర సెలవుల్ని రద్దు చేసింది. వ్యక్తిగత, ప్రజా భద్రత నిమిత్తం యుద్ధ సన్నద్ధతతో పనిచేయాలని బలగాలను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. సెలవుల నుంచి తిరిగి వచ్చినవారిలో ఫ్లూ లక్షణాలు ఉన్నాయా అనేది పరీక్షిస్తున్నారు. అత్యవసరం కాని ప్రయాణాలను, సదస్సులను రద్దు చేశారు. బుధవారం సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు 151 నమోదయ్యాయి. అయితే తెలంగాణలో మరో ఏడుగురికి కరోనా సోకినట్లు రాత్రి పొద్దుపోయాక నిర్ధారణయ్యింది. పరీక్షలు రాయకుండానే ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల్ని ఉత్తీర్ణుల్ని చేసేలా రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది. యూపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాయకుండానే తదుపరి తరగతికి పంపించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.
* ఇటీవలే సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన కేంద్ర మాజీ మంత్రి సురేశ్ ప్రభు ముందు జాగ్రత్తగా ఇంటికే పరిమితమయ్యారు.