[spt-posts-ticker]

ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సుస్తీ!

 

 

హైదరాబాద్‌:  ఒక ఉన్నతాధికారి అక్రమాలు.. అవినీతి.. కార్మికుల ఆరోగ్య సేవలకు ఎసరు తీసుకొచ్చింది. ఈఎస్‌ఐలో భారీ కుంభకోణం బయట పడిన తర్వాత ఔషధాల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం విధివిధానాలు రూపొందించకపోవడంతో సమస్య తీవ్రమవుతోంది. ఈఎస్‌ఐ డిస్పెన్సరీల సేవలు పేద కార్మికులకు అందడం లేదు.  రక్తపోటు, మధుమేహం, నొప్పి నివారణ తదితర మందులూ అందుబాటులో లేకపోవడంతో రోగులు గగ్గోలు పెడుతున్నారు.

* గ్రేటర్‌ వ్యాప్తంగా దాదాపు 37 ప్రాంతాల్లో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను నిర్వహిస్తోంది. మొత్తం 13-14 లక్షల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఆధారపడ్డారు. అన్ని రకాల ప్రాథమిక ఆరోగ్య సమస్యలకు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. సంబంధించిన నిధులను కేంద్రమే నేరుగా రాష్ట్రానికి ఇస్తుంది. నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. సకాలంలో కొనుగోలుకు టెండర్ల కుదరకపోవడంతో అన్ని డిస్పెన్సరీలకు మందుల సరఫరా ఆగిపోయింది. ఔషధ కొనుగోళ్లలో అక్రమాలు బయట పడిన తర్వాత కొత్తగా మందుల కొనుగోలు విషయంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటివరకు ఏదోలా సర్దుబాటు చేసినా పూర్తిగా మందుల సరఫరా నిలిచిపోవడంతో కొన్ని కేంద్రాలను మూసివేస్తున్నారు. రోగులకు 269 రకాల ఔషధాలు సరఫరా చేసేవారు. అధిక రక్తపోటు, మధుమేహం, యాంటిబయోటిక్స్‌, కేన్సర్‌ తదితర జీవధార మందులకూ దిక్కులేకుండా పోయింది.

డిప్యుటేషన్ల రద్దుతో.. ఈఎస్‌ఐ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది గతంలో డిప్యుటేషన్లపై పనిచేసేవారు. డిప్యుటేషన్ల రద్దుతో ఇక్కడ పనిచేసేవారు కరవయ్యారు. చిక్కడపలి, తార్నాక, రెజిమెంటల్‌బజార్‌, డబీర్‌పురా డిస్పెన్సరీల్లో టెక్నీషియన్లు లేక ల్యాబ్‌లు మూసేశారు. గోల్కొండ, చర్లపల్లి, మేడ్చల్‌లో ఫార్మాసిస్టులు లేక మందుల దుకాణాలు మూతపడ్డాయి. తార్నాకలో ల్యాబ్‌ తెరవడంలేదు. కార్మికులకు ఉచిత వైద్య సేవలు అందక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చేతి చమురు వదిలించుకుంటున్నారు. గతేడాది ఆగస్టులో మందుల కోసం ఇండెట్లు వెళ్లినా ఇంకా సరఫరా కాలేదు. ఇప్పటికే కార్మికులు పలుమార్లు ధర్నాకు దిగారు. ప్రభుత్వ ఆసుపత్రులన్నింటికి టీఎస్‌ఎంఐడీసీ మందులను సరఫరా చేస్తున్నట్లుగా ఈఎస్‌ఐలకూ ఔషధాలు సరఫరా చేసి కార్మికులను ఆదుకోవాలని సీపీఎం నగర కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *