[spt-posts-ticker]

ఊపిరాడాలంటే..ఉపకేంద్రానికి వెళ్లాల్సిందే!

విద్యుత్తు లేకపోతే విలవిల
శ్వాసకోశ వ్యాధితో ఓ అభాగ్యుని వేదన

నేలకొండపల్లి (ముదిగొండ), న్యూస్‌టుడే: కరెంటు లేకపోతే ఆయనకు ఊపిరాడదు. ఫ్యానో, ఏసీనో లేకపోతే ఉక్కపోతకు ఉక్కిరిబిక్కిరయ్యే వ్యవహారం కాదిది. నిజంగానే ఆయనకు శ్వాస ఆడదు. అదేంటనుకుంటున్నారా? ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడే ఆయన ఓ పరికరం సాయంతో శ్వాస తీసుకుంటూ ఉంటారు. కరెంటు లేకపోతే ఆ పరికరం పనిచేయదు. దాంతో ఆయనకు గాలి ఆడక ఉక్కిరిబిక్కిరవుతారు. ఊపిరి నిలబెట్టుకోవడానికి ఆయన కరెంటు ఉపకేంద్రానికి పరుగులు పెడతారు. అక్కడ కరెంటు పెట్టుకుని ఆయన హమ్మయ్య అంటూ ఊపిరిపీల్చుకుంటారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజారాంపేటకు చెందిన ములకలపల్లి పిచ్చయ్య దయనీయ గాథ ఇది.  ఇంతకుముందు హమాలీగా పనిచేసిన ఈయన వయస్సు 38 ఏళ్లు. భార్య, కుమార్తె ఉన్నారు. గతంలో మూత్రపిండాల వ్యాధితో మంచానపడ్డారు. దీనికి ఊపిరితిత్తుల వ్యాధి తోడైంది. చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లగా నిరంతరం ఆక్సిజన్‌తోనే ఉండాలని వైద్యులు సూచించారు. ఒక ఏడాదికి సరిపడా ఆక్సిజన్‌ అందించే యంత్రాన్ని అందించారు. గడువు ముగియడంతో ఆ యంత్రాన్ని ఆసుపత్రి వారు తీసుకెళ్లారు. విషయం తెలిసిన గ్రామంలోని యువకులు చందాలు వేసుకుని రూ.60 వేలు సేకరించారు. రూ.42 వేలతో ఆక్సిజన్‌ యంత్రాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. మిగతా నగదును చికిత్స కోసం అందజేశారు. ఆక్సిజన్‌ యంత్రానికి విద్యుత్తు అవసరం. తరచూ విద్యుత్తు అంతరాయం ఏర్పడుతూ ఉండటం ఆయనకు సమస్యగా మారింది. కరెంటు పోయినపుడల్లా విద్యుత్తు ఉపకేంద్రం వద్దకు వెళ్లి ఆక్సిజన్‌ యంత్రానికి విద్యుతు పెట్టుకుంటూ ఉంటారు. ఆయన భార్య రేణుకకూ గతంలో గుండె సంబంధ చికిత్స జరిగింది. కూతురు నీలిమ  పదో తరగతి చదువుతోంది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు. అన్నం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు అన్నం శ్రీనివాసరావు, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు గురువారం పిచ్చయ్యను పరామర్శించారు. దాతలు ముందుకు వచ్చి పిచ్చయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *