ఢిల్లీ,(ఆరోగ్యజ్యోతి): ఢిల్లీలో మరో వైద్యుడికి కరోనా వైరస్ సోకింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ లో ఫిజియాలజీ విభాగంలో సేవలందిస్తున్న డాక్టర్ కి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన ఐసోలేషన్ వార్డులో చేరి టెస్టు చేయించుకున్నారు. ఆయనకు వైరస్ ఉన్నట్లు గురువారం తేలింది. ఆయన ఎటువంటి విదేశీ ప్రయాణం చేయలేదని అధికారులు తెలిపారు. అయితే ఆ డాక్టర్ కి వైరస్ ఎలా సోకిందన్నది తెలియాల్సి ఉంది. ఆయనను ఇటీవల చికిత్స కోసం కలిసి పేషెంట్లను గుర్తించేందుకు ఢిల్లీ అధికారులు రంగంలోకి దిగారు. ఢిల్లీలో ఇప్పటికే సఫ్దర్ గంజ్ ఆస్పత్రిలోని కరోనా వార్డులో పని చేసే ఓ డాక్టర్ కు, పీజీ చదువుతూ ఆస్పత్రిలో డ్యూటీ చేస్తున్న మరో మహిళా రెసిడెంట్ డాక్టర్ కు కూడా వైరస్ సోకింది. అలాగే ఓ మొహల్లా క్లినిక్ డాక్టర్ కూడా కరోనా బారినపడ్డారు. ఇలా పలువురు వైద్యులు ఈ మహమ్మారి బారినపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తంగా 150 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 2 వేలు దాటింది. అందులో 65 మంది మరణించగా.. 170 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు