[spt-posts-ticker]

కరోనాతో ముడిసరుకు కొరత

  • దోళనలో ఫార్మా, బల్క్‌డ్రగ్‌, ఎలక్ట్రానిక్స్‌
  • అందుబాటులో మార్చినాటికి సరిపోయేంత ముడిసరుకు
  • సమస్య తీవ్రమయ్యే అవకాశాలున్నాయని అంచనా

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కరోనా వైరస్‌ పారిశ్రామికరంగంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది. దీని కారణంగా ఫార్మా, బల్క్‌డ్రగ్‌, ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలు ఆందోళనకు గురవుతున్నాయి. మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా పేరొందిన చైనా నుంచి మన రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకు ఎక్కువగా దిగుమతి అవుతుంది. చైనా సరుకు తక్కువ ధరకు లభిస్తుండటంతో అక్కడి నుంచి వచ్చే ముడిసరుకుపైనే చాలా పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయి. కరోనా వైరస్‌ కారణంగా చైనాలో పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి పరిశ్రమలకు కావాల్సిన ముడిసరుకు అందని పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పారిశ్రామికవర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. మన రాష్ట్రంలోని అధిక సంఖ్యలోని ఫార్మా పరిశ్రమలు ముడిసరుకును చైనా నుంచి దిగుమతి చేసుకొంటున్నాయి. మార్చి నెలాఖరుకు సరిపోయేంత ముడిసరుకును ఇప్పటికే దిగుమతి చేసుకొన్నారు. కరోనా వైరస్‌ సమస్య మార్చి తర్వాత కూడా కొనసాగినపక్షంలో ముడిసరుకు కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

త్వరలో తమ దేశంలోని పరిశ్రమలు తిరిగి ప్రారంభమవుతాయని చైనా ప్రభుత్వం ప్రకటించింది. కరోనా అదుపులోకి వచ్చి సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇబ్బందులు తప్పవని ఇక్కడి పారిశ్రామికవర్గాలు భావిస్తున్నాయి. అలాకుదరనిపక్షంలో ముడిసరుకును ఇతర దేశాలనుంచి గానీ, మన దేశంలోగానీ కొనుగోలు చేయడానికి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుందని ఎఫ్టీసీసీఐ ఉపాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి చెప్పారు. కరోనా వైరస్‌ ప్రభావం పరిశ్రమలపై తప్పకుండా ఉంటుందని, మధ్యతరగతి పరిశ్రమలపై ప్రభావం అధికంగా ఉంటుందని సీఐఐ అధ్యక్షుడు రాజు తెలిపారు. ఇతర దేశాల నుంచి దిగుమతులను తగ్గించేందుకు దేశంలో ఫార్మా, బల్క్‌డ్రగ్‌ ముడిసరుకు అందేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఇప్పటికీ కార్యాచరణలోకి రాకపోవడం వల్ల పరిశ్రమలు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారిస్తున్నాయి.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *