హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి) : ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో మాసాబ్‌ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ నుంచి మంత్రి తలసాని బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వం ఆమలు చేస్తున్న కార్యక్రమాల ఆమలు తీరుపై మంత్రి సమీక్షించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తలసాని స్పష్టం చేశారు. కరోనా నియంత్రణ కోసం అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు ప్రతి రోజు రెండు గంటల పాటు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
అందరినీ ఆదుకుంటాం
వివిధ రాష్ర్టాల నుంచి నగరానికి 85వేల మంది ఉపాధి కోసం వలస వచ్చి జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలలో నివసిస్తున్నారని, వారిని సీఎం కేసీఆర్ తమ బిడ్డలుగా భావించి ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదును అందజేస్తున్నట్లు తెలిపారు. ఆదేవిధంగా తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, ఒక కార్డుకు రూ.1500 నగదు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ఆనంతరం మంత్రి తలసాని జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, సీఆర్వో బాలా మాయాదేవిలతో మాట్లాడి ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజింత్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు మాట్లాడారు. కరోనా నియంత్రణ సమయంలో సీఎం కేసీఆర్ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని, ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం పట్ల శ్రీనివాస్ యాదవ్‌ను మంత్రి మల్లారెడ్డి అభినందించారు.
11 రోజులు.. 5,724 ప్రాంతాలు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగా గడిచిన పదకొండు రోజుల్లో నగర వ్యాప్తంగా 5724ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. కరోనా వ్యాధి రోగులున్న దవాఖానలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అనుమానితులు నివసించే ప్రాంతాలు, ప్రభుత్వ క్వారంటైన్లు, హోమ్ క్వారంటైన్లు తదితర ప్రాంతాల్లో స్ప్రే నిర్వహించినట్లు వారు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో 2375 మంది కార్మికులతో కూడిన 125 యూనిట్లు ఈ స్ప్రేయింగ్ పనుల్లో నిమగ్నమయ్యాయి. కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో రెండు, మూడు దఫాలు స్ప్రే చేస్తున్నారు. స్ప్రేయింగ్‌కు ఒక వెయ్యి పవర్ స్ప్రేయర్లు, 600 నాప్సాక్ స్ప్రేయర్లు, 63 వీఎంఎఫ్ పెద్ద స్ప్రేయర్లను వినియోగిస్తున్నారు. ప్రతి వీఎంఎఫ్ స్ప్రే ద్వారా రోజు 15 కిలోమీటర్లు స్ప్రే చేస్తుండగా, 305 పోర్టబుల్ స్ప్రేయర్ల ద్వారా ప్రభావిత కాలనీల్లో ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి రోజు 500-600 ఏరియాల్లో ఈ క్రిమి సంహారక మందును పిచికారీ చేస్తున్నారు. మార్చి 22వ తేదీనుంచి ఏప్రిల్ ఒకటి వరకు 5724 ఏరియాల్లో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసినట్లు వారు వివరించారు. నగరంలోని 150 డివిజన్లలో నిర్వహిస్తున్న పిచికారీ పనులను ముగ్గురు సీనియర్, 17మంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు పర్యవేక్షిస్తుండగా, ఎంటమాలజీ విభాగం స్ప్రేయింగ్ పనులను జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం అదనపు కమిషనర్ రాహుల్ రాజ్, చీఫ్ ఎంటమాలజిస్టు రాంబాబు సమన్వయం చేస్తున్నారు. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ అధికారులు కోరిన వెంటనే ఆయా ప్రాంతాలకు బృందాలను పంపుతూ ద్రావణం పిచికారీ పనులు కొనసాగిస్తున్నారు.