సుల్తాన్‌బజార్ : రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని,ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య పేర్కొన్నారు.శనివారం హెచ్ఆర్సీలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు,వైద్య విధాన పరిషత్ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ రమేశ్‌రెడ్డితో పాటు వైద్యాధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇదిలా ఉండగా హెచ్ఆర్సీలో అందిన ఫిర్యాదులను కమిషన్ సుమోటోగా స్వీకరించి వైద్యశాఖ ఉన్నతాధికారులతో కరోనా వైరస్‌పై రాష్ట్రం లో ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని కమిషన్‌లో జస్టిస్ చంద్రయ్య, జ్యూడీషియరీ సభ్యులు ఆనంద్‌రావు,నాన్ జ్యుడీషియరీ సభ్యులు ఇర్ఫాన్ మోహినుద్ద్దీన్ కమిటీ డీఎంఈ రమేశ్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రమేశ్‌రెడ్డి మాట్లా డుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. గాంధీ దవాఖానలో వైరస్ సోకిన వారి కోసం ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఫీవర్ దవాఖానలో 40, ఛాతి దవాఖాలో 20 పడకలను అందుబాటులో ఉంచామన్నారు.వైరస్ వ్యాప్తి పై ప్రజలు ఎటువంటి అపోహలకు గురికావద్దని పత్రికలు, మీడియా,సోషల్ మీడియా, రింగ్టోన్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారన్నారు.ఉస్మానియా, ఫీవర్ దవాఖానాల సూపరింటెండెంట్లు డాక్టర్ నాగేందర్,డాక్టర్ శంకర్లు మాట్లాడుతూ కరోనా వైరస్ పాతదేనన్నారు. కార్యక్రమంలో నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ,డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నోడల్ అధికారి డాక్టర్ విజయ్ కుమార్,డాక్టర్ సుబ్బలక్ష్మి,డాక్టర్ శ్రీహర్ష,డాక్టర్ గణపతి,డాక్టర్ నవ్య,డీపీఆర్వో యామిరి పాల్గొన్నారు.