ఆదివారం రాత్రి 9గం టలు.. రాష్ట్రంలో ఒక్కసారిగా చీకట్లు అలముకున్నాయి.. ఉన్నట్టుండి ప్రజలంతా ఇళ్లలోని లైట్లు ఆపేశారు. చీకటి తెరలు అలా వాలా యో లేదో.. వాటిని చీల్చుకుంటూ కాంతులు ప్రసరించాయి. కరోనా మహమ్మారిపై సమరశంఖం పూరించాయి. ‘గో కరోనా.. గో. మా దేశం విడిచి వెళ్లు’ అంటూ కోట్లాది గొంతులు ” ఆరోగ్యజ్యోతు లను వెలిగించారు.
కరోనా మహమ్మారిని దేశవాసులమంతా మూకుమ్మడిగా ఎదుర్కొంటామనే ఐక్యతా స్ఫూర్తిని చాటి చెప్పేందుకు, ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి తెలంగాణ అద్భుతంగా స్పందించింది. గత నెల 22న జనతా కర్ఫ్యూ సందర్భంగా సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టే కార్యక్రమానికి దీటుగా ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించే కార్యక్రమం జరి గింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్ తమ నివాసాలైన రాజ్‌భవన్, ప్రగతిభవన్లలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వీరితో పాటు కుల, మత, ప్రాంత, రాజకీయ విభేదాలకు అతీతంగా ప్రజలంతా దీపాలు వెలి గించడం ద్వారా కరోనా రక్కసిపై యుద్ధం చేస్తామని ప్రతినబూనారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, రైతులు, మహిళలు, యువకులు, చిన్నారులు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు ఐక్యతా స్ఫూర్తిని చాటుతూ తమ నివాసాల వద్ద దీపాలు వెలిగించగా, బీజేపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. వ్యాపార, వాణిజ్య వర్గాలు, సినీ ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, ప్రజలు స్వచ్ఛందంగా ఉద్యమస్ఫూర్తిని చాటారు.