[spt-posts-ticker]

కరోనా కట్టడికి పారిశుధ్య కార్మికులకు శిక్షణ

హైదరాబాద్ :  కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నది. దీనికోసం ఓ కార్యప్రణాళికను సిద్ధంచేశారు. ఇందులో భాగంగా ఆనారోగ్యంతో వచ్చిన విదేశీయులు, విదేశాలనుంచి వచ్చిన మన దేశీయులపై గట్టి నిఘా ఏర్పాటుచేయాలని నిశ్చయించారు. దీనికోసం నాలుగు విభాగాల క్షేత్రస్థాయి అధికారులను బృందాలను ఏర్పాటుచేస్తున్నారు. అంతేకాదు, వారుండే ప్రాంతాల్లో ప్రత్యేకంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టడంతోపాటు  ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, కార్మికుల రక్షణకు రక్షణ సామాగ్రితోకూడిన కిట్‌లను పంపిణీచేయాలని నిర్ణయించారు.

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో తాజాగా జీహెచ్‌ఎంసీ, రెవిన్యూ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు తదితర విభాగాల క్షేత్రస్థాయి అధికారులతో నలుగురు సభ్యులుగల సంయుక్త నిఘా బృందాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. మంగళవారం ఈ బృందాలు ఏర్పాటుకానున్నాయి. బృందాల ఏర్పాటు వార్డులవారీగానా,  లేక సర్కిళ్లవారీగానా అనేది నిర్ణయించాల్సి ఉంది. ఇటీవల అనారోగ్యంతో నగారానికి వచ్చిన విదేశీయులతోపాటు విదేశాలనుంచి వచ్చిన మన దేశస్థులపై వీరు నిఘా ఏర్పాటుచేస్తారు.

170మంది విదేశీయులుసహా మొత్తం 750మంది ఈ తరహా వ్యక్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు వారిపై ప్రత్యేక నిఘాను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. విమానాశ్రయంలో ప్రాథమిక పరీక్షలు నిర్వహించిన అధికారులు వారిని కొద్దిరోజులు బయటకు వెల్లకుండా ఉండాలని ఇదివరకే సూచించారు. తాజాగా ఈ నిఘా బృందాలు వారుంటున్న ప్రాంతాలకు వెళ్లి వారు ఇతరులతో కలవకుండా విడిగా ఉంటున్నారా, లేదా అనేది పరిశీలిస్తారు. వారి ఇళ్లకు వెళ్లి కొద్దిరోజులపాటు బయటకు రాకుండా చేయడంతోపాటు వ్యాధిపై వారికి అవగాహన కల్పిస్తారు. ఒకవేళ వారు విడిగా ఉండే వీలులేకుంటే వారిని ఐసోలేషన్‌ ప్రాంతానికి తరలించాలని నిశ్చయించారు. ఈ 750మంది ఎక్కడున్నారనేది పోలీసుశాఖ వద్ద సమాచారం ఉందని, వారిచ్చే సమాచారం ఆధారంగా నిఘా బృందాలు  అక్కడికి చేరుకుంటాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

విధులపై కార్మికులకు నేడు శిక్షణ, రక్షణ కిట్‌ల పంపిణీ…

ఇక బల్దియా పారిశుధ్య కార్మికుల విషయానికొస్తే, దాదాపు 18000మంది కార్మికులు పారిశుధ్య విధుల్లో కొనసాగుతున్నారు. వీరందరికీ మాస్క్‌లు, గ్లౌజ్‌లు, బూట్లు, జాకెట్స్‌, శానిటైజర్‌తో కూడిన కిట్‌లను అందజేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్లు, ఒకవేళ ఎక్కడైనా తక్కువపడితే వెంటనే కొనుగోలుచేయాలని జోనల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీచేసినట్లు అధికారులు తెలిపారు. విదేశీయులు, విదేశాలనుంచి వచ్చి అనారోగ్యంతో ఉన్నవారు నివశించే ప్రాంతాల్లో ఏ విధమైన ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టాలి, తమ రక్షణకు ఏ విధంగా వ్యవహరించాలి అనేదానిపై మంగళవారం శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు శిక్షణనివ్వాలని నిర్ణయించారు.

ప్రైవేటు జిమ్ములు, అమ్యూజింగ్‌ పార్కులూ మూసివేత…..

మరోవైపు, ఇప్పటికే స్కూళ్లు, సినిమాహాళ్లు, జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలోని ఆటమైదనాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, వ్యాయామశాలలు తదితరవాటిని మూసియగా, తాజాగా ప్రైవేటు రంగంలోని ఆట మైదానాలు, వ్యాయామశాలలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు తదితరవాటిని కూడా మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో అందరికీ నోటీసులు జారీచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరైనా మూసివేయకుంటే పోలీసు సహాయంతో బలవంతంగా మూసివేయనున్నట్లు, అంతేకాకుండా వాటి నిర్వాహకులపై చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. సోమవారం మొగల్‌పురాలోని జీహెచ్‌ఎంసీ ఆట మైదానాన్ని కొందరు బలవంతంగా తెరిపించగా, తాము వెంటనే రంగంలోకి దిగి మూసివేయించినట్లు వివరించారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *