హైదరాబాద్: కరోనా సోకితే ఎలా? చికిత్స కోసం లక్షలు వెచ్చించాల్సిందేనా? అని ఆందోళన చెందుతున్నారు. అలాంటి వారికి బీమా కంపెనీలు ధీమా కలిగిస్తున్నాయి. దీని వల్ల ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజుల భారం తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీమా తీసుకుంటున్న వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందని మ్యాక్స్‌బూపా ఆరోగ్య బీమా సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. కరోనాకు ముందు హైదరాబాద్‌లాంటి నగరాల్లో 22ు మంది ఇలాంటి ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేవారు. ఇప్పుడు 84ు బీమా ధీమా కోసం సిద్ధమవుతున్నారని ఆ సర్వే వెల్లడించింది. బీమా కంపెనీలు కూడా ఐఆర్డీఏ మార్గదర్శకాలను అనుసరించి కరోనా కోసం ప్రత్యేక బీమా పాలసీలను ప్రకటించాయి. ‘కరోనా కవచ్’, ‘కరోనా రక్షక్’, ‘ఆరోగ్య సంజీవనీ’ పేర వ్యక్తిగత, కుటుంబ, గ్రూపు పాలసీలను అందుబాటులోకి తెచ్చాయి. రిలయన్స్, ఫ్యూచర్ జనరల్ హెల్త్ ఇన్స్యూరెన్స్ వంటి కంపెనీలు గ్రూపు బీమా పాలసీలను అమలు చేస్తున్నాయి. ఓరియంటల్ హెల్త్ ఇన్స్యూరెన్స్, స్టార్ హెల్త్ వంటి కంపెనీలు వ్యక్తిగత, కుటుంబ పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చాయి.
కొవిడ్-19 చికిత్సలను అందజేసే బీమా పాలసీల్లో.. ప్రీమియం, కాల పరిమితి వేర్వేరుగా ఉంటున్నాయి. చాలా కంపెనీలు 3.5 నెలలు, 6.5 నెలలు, 9.5 నెలల కాల పరిమితితో పాలసీలను అమలు చేస్తున్నాయి. ఈ పాలసీల కవరేజీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఉంటుంది. రోగ నిర్ధారణ పరీక్షలు మినహా.. ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి డిశ్చార్జి అయ్యేవరకు ఖర్చులను భరిస్తామని బీమా కంపెనీలు ప్రకటిస్తున్నాయి. చాలా కంపెనీలు ఆస్పత్రిల్లో ఉండే కాల పరిమితిని నెల రోజులుగా ప్రకటించాయి. కొన్ని పాలసీల్లో రోజుకు రూ.5000 చొప్పున సీలింగ్ పెట్టగా, మరికొన్ని పాలసీల్లో పరిమితిని రూ.3000గా పేర్కొంటున్నాయి. పాలసీలను క్లెయిమ్ చేసుకునే కరోనా వ్యాధిగ్రస్థుడికి చికిత్స సంబంధిత అన్ని సదుపాయాలను అందజేస్తాయి. ఔషధాలు, పీపీఈ కిట్లు, గ్లౌజులు, మాస్కులు, వెంటిలేటర్లు, ఐసీయూ చార్జీలు, ఆక్సీమీటర్, ఆక్సిజన్ సిలిండర్ వంటివాటి ఖర్చులను భరిస్తున్నాయి.
ఆరోగ్య సంజీవనీ పాలసీ..
కేంద్ర ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ‘ఆరోగ్య సంజీవనీ’ పాలసీ అమల్లోకి వచ్చింది. కరోనా వ్యాధితోపాటు వివిధ వ్యాధులకు దీని కింద చికిత్స అందించే అవకాశం ఉంది. ఈ పాలసీని అన్ని ఆరోగ్య బీమా కంపెనీలు అమలు చేయాలంటూ బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏ) ఆదేశించింది. ఇప్పటికే 29 కంపెనీలు ఈ పాలసీని అందిస్తున్నాయి. ఇది దేశమంతటా ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చింది. దీనికింద ప్రీమియం రేటును నిర్ణయించే అధికారాన్ని మాత్రం బీమా కంపెనీలకే వదిలిపెట్టింది. దీంతో ఒక్కో కంపెనీ ఒక్కో రకంగా ప్రీమియంను వసూలు చేస్తున్నాయి. దీని కింద రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు కవరేజీ ఉంటుంది. దీనిని వ్యక్తిగతంగా, కుటుంబ పాలసీలుగా అమలు చేస్తున్నారు. ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి 30 రోజుల వరకు పాలసీ కింద ఖర్చులను బీమా కంపెనీ భరిస్తుంది.