దిల్లీ: రోజురోజుకూ విస్తరిస్తున్న కరోనాను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. దీని నివారణ కోసం రాష్ట్ర ప్రకృతి విపత్తు ఉపశమన నిధి (ఎస్డీఆర్ఎఫ్) నుంచి ఖర్చు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిస్తూ కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత కరోనా మృతులకు రూ.4 లక్షల ఎక్స్గ్రేషియా, రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసిన మేరకు వైద్య ఖర్చులు చెల్లించడానికి అనుమతిచ్చిన కేంద్రం వెంటనే ఆ రెండింటినీ తొలగిస్తూ మరో ఉత్తర్వు జారీ చేసింది. మిగతావారితో కలవనీయకుండా విడిగా (క్వారంటైన్లో) ఉంచే వారికి 30 రోజుల వరకు ఆహారం, వస్త్రాలు, వైద్యసేవలు అందించడానికి ఎస్డీఆర్ఎఫ్ నిధులు వాడుకోవచ్చని అనుమతిచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఈ గడువును పెంచుకోవచ్చని చెప్పింది. వీటిపై చేసే వ్యయం ఎస్డీఆర్ఎఫ్ వార్షిక కేటాయింపుల్లో 25 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది.
వీటికి ఎన్డీఆర్ఎఫ్ నిధులుండవు
నమూనాల సేకరణ, తనిఖీలు, స్క్రీనింగ్ కోసం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఖర్చు చేయాలని కేంద్రం పేర్కొంది. అత్యవసర వస్తువుల కొనుగోలు, అదనపు ప్రయోగశాలల ఏర్పాటు, వైద్య, మునిసిపల్, పోలీసు, అగ్నిమాపక దళ సిబ్బంది రక్షణ కోసం ఉపయోగించే వస్తువులు, థర్మల్ స్కానర్లు, వెంటిలేటర్లు, గాలిని శుద్ధి చేసే పరికరాలు (ఎయిర్ ప్యూరిఫయర్లు), ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపయోగించే వస్తువుల కోసం వ్యయాన్ని అంతా ఎస్డీఆర్ఎఫ్ నుంచి మాత్రమే చేయాలి. దీనికి ఎన్డీఆర్ఎఫ్ నిధులు ఉపయోగించకూడదు. ఎస్డీఆర్ఎఫ్ను పర్యవేక్షించే కమిటీ రాష్ట్రంలోని పరిస్థితులను అంచనావేసి వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జారీచేసే ఆదేశాలకు అనుగుణంగా నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పరికరాలపై మొత్తం ఖర్చు ఎస్డీఆర్ఎఫ్ వార్షిక కేటాయింపుల్లో 10%కి మించకూడదు. కేంద్రం నిర్దేశించిన పరిమితులకు మించి రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చుచేస్తే ఆ అదనపు మొత్తాన్ని సొంత వనరుల నుంచే సమకూర్చుకోవాలని, ఎస్డీఆర్ఎఫ్ నుంచి వాడుకోవడానికి వీల్లేదని ఉత్తర్వు స్పష్టం చేసింది.