హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత మల్లు భట్టివిక్రమార్క కోరారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తమ పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆదివారం శాసనసభలో ఆయన మాట్లాడారు. అనుమతి లేకుండానే కార్పొరేట్ విద్యా సంస్థల బ్రాంచీలు ఏర్పాటవుతున్నాయని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ కళాశాల్లో చదివేవారికి కూడా బోధన రుసుముల చెల్లింపు పథకం వర్తించేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నప్పటికీ చాలా గ్రామాల్లో నీళ్లు రావడంలేదని, తన నియోజకవర్గానికి వచ్చి వాస్తవాలు చూడాలని ఆయన స్పీకర్ను ఆహ్వానించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదని వెంటనే ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారిలో కొందరు రాజీనామా చేశారని, అలా ఖాళీ అయిన పోస్టులను మెరిట్ ప్రకారం తర్వాతి స్థానాల్లో ఉన్న వారితో భ¡ర్తీ చేయాలని సూచించారు.
పేదలకు వైద్య వసతుల సమస్య: రాజగోపాల్రెడ్డి
ప్రభుత్వ వైద్యంపై వెచ్చిస్తున్న మొత్తం సద్వినియోగం కావడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఆరోపించారు. పేదలకు వైద్యవసతులు సమస్య రాష్ట్రంలో తీవ్రంగా ఉందని అన్నారు. చౌటుప్పల్లో పేరుకే 30 పడకల ఆస్పత్రి ఉందన్నారు. మిషన్ భగీరథ ద్వారా చాలాచోట్ల ఇంటింటికీ నీరు అందడంలేదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో 334 గ్రామాలు ఉండగా నల్లాల ద్వారా సగం గ్రామాలకు నీళ్లు రావడంలేేదన్నారు. భారీగా అప్పులు చేసి చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టుల్లో పారదర్శకతలేదన్నారు. బిల్లుల చెల్లింపులో నిబంధనలు పాటించడంలేదన్నారు. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.