[spt-posts-ticker]

కరోనా వస్తే అంతే!

  • ఆంధ్రలో మందుల్లేవ్‌..  మాస్కుల్లేవ్‌..
  • హైదరాబాద్‌లో కొవిడ్‌ కలకలం
  • దీంతో కళ్లు తెరిచిన ఆరోగ్యశాఖ
  • మాస్క్‌లు కొనుగోలుకు హడావిడి
  • భారీగా రేట్లు పెంచిన కంపెనీలు
  • నెల రోజుల్లో సీడీఎ్‌సల్లో తగ్గనున్న స్టాక్‌
  • మందుల కొరత తప్పదంటున్న నిపుణులు

అమరావతి: కరోనా (కొవిడ్‌-19) కోరల్లో చిక్కుకున్న చైనా పరిస్థితి చూస్తుంటే ప్రపంచ దేశాలు హడలెత్తిపోతున్నాయి. ఆ వైరస్‌ తమకు ఎక్కడ వ్యాపిస్తుందోనని భయంతో ఆ దేశంతో రాకపోకలు కట్‌ చేసుకుంటున్నాయి. అన్ని రకాల సౌకర్యాలు, నిపుణులైన వైద్యులు, అద్భుతమైన వ్యవస్థ ఉన్న చైనానే కరోనా దెబ్బకు వణికిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్‌ వైద్యాధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. నిన్నటివరకూ సమావేశాలు, బులిటెన్లు విడుదల చేయడానికే పరిమితమైన అధికారులు హైదరాబాద్‌లో కరోనా కేసు బయటపడేసరికి హడావిడి చేస్తున్నారు. నెల క్రితం చేయాల్సిన పనులను ఇప్పుడు ప్రారంభించారు. రాష్ట్రంలో సరిపడా మందులున్నాయా..? వైద్యుల వ్యక్తిగత రక్షణకు కిట్‌లు ఉన్నాయా..? కరోనా వస్తే ఎలాంటి వైద్యం అందించాలి..? దీనిపై వైద్యులకు శిక్షణ ఇచ్చారా..? లేదా..? అంటూ ఆరా ప్రారంభించారు.

వాస్తవానికి కరోనా వైరస్‌ నియంత్రణకు ఇప్పటివరకూ మందులు లేవు. దాని వల్ల వచ్చే ఇతర రోగాలకు సంబంధించిన మందులతో నియంత్రణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా బాధితులకు జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస సంబంధింత సమస్యలు వస్తుంటాయి. వాటిని అదుపుచేయడం తప్ప మరో మార్గం లేదు. అయితే వాటికి అవసరమైన మందులు కూడా చాలా జిల్లాల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. కరోనా బయటపడి రెండు నెలలు కావస్తోంది. నెలన్నర నుంచి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలనూ హెచ్చరిస్తోంది. కానీ ఇక్కడ అధికారులు సమీక్షలతో కాలం గడిపేసి, జిల్లాల్లో మందుల విషయాన్ని గాలికి వదిలేశారు.

ఇప్పటికిప్పుడు ఆర్డర్లు..

కరోనా సోకిన వారికి చికిత్స అందించే వైద్యులకు బాడీ మాస్క్‌లు అవసరం. ఇప్పటి వరకూ రాష్ట్రంలో నాణ్యమైన బాడీ మాస్క్‌ ఒక్కటి కూడా లేదు. సాధారణ మాస్క్‌లు.. అవి కూడా ఎప్పుడో కోనుగోలు చేసినవి డీఎంహెచ్‌వో కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 13 ఐసోలేటేజ్‌ వార్డుల్లో కూడా వాటినే పెట్టారు. అవి వాడితే వైద్య సిబ్బందికి కూడా వైరస్‌ సోకే ప్రమాదం ఉంది. దీంతో ఆరోగ్యశాఖ అధికారులు సోమవారం సాయంత్రం అప్రమత్తమయ్యారు.

చైనా వంటి దేశాల్లో వాడే నాణ్యమైన బాడీ మాస్క్‌లను తెప్పించేందుకు ఆర్డర్లు ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆర్డర్లు ఇవ్వడం వల్ల రేట్లు కూడా భారీగా పెంచేశారు. మరోవైపు ఇప్పుడు ఆర్డర్‌ ఇచ్చినా కంపెనీలు వాటిని సరఫరా చేయడానికి 15 నుంచి 20 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. మొన్నటి వరకూ రూ.5 వేల నుంచి రూ.6 వేలున్న బాడీ మాస్క్‌ల ధర ఇప్పుడు రూ.10 వేలకుపైనే చెబుతున్నారు. మరోవైపు ఇన్ఫెక్షన్‌ రాకుండా ఉపయోగించే సాధారణ మౌత్‌ మాస్క్‌లు గతంలో రూ.2 నుంచి రూ.3లకు లభించేవి. ఇప్పుడు వాటి ధర  కూడా రూ.10 పైనే ఉంది. ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేద్దామన్నా బయట మార్కెట్‌లో అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ వద్ద ఉన్న మందులు, మాస్క్‌లు నెల, నెలన్నరకు మించి రావు. ఈ విషయం పట్ల కూడా ఆరోగ్యశాఖ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీని వల్ల మందులు, మాస్క్‌లు కొనుగోలు చేయాలంటే భారీగా వ్యయం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఏపీలో కరోనా ప్రబలితే కష్టమే నిపుణులు హెచ్చరిస్తున్నారు.

చేతులెత్తేసిన కంపెనీలు..

మరోవైపు మందుల కంపెనీలు, సర్జకల్‌ ఐటమ్స్‌ సరఫరా దారులు మొత్తం చేతులెత్తేశారు. ఏపీఎంఎ్‌సఐడీసీకి సరఫరా చేయడం మా వల్ల కాదని ఉన్నతాధికారుల వద్ద వాపోతున్నారు. బిల్లులు ఆలస్యంగా చెల్లిండమే దీనికి కారణం. ఇప్పటికే కరోనా ప్రభావంతో ముడిసరుకు కొరత తీవ్రంగా ఉంది. ముడిసరుకును ముందే కొనుగోలు చేసుకుంటే మంచిదని ఫార్మాలు భావిస్తున్నాయి. కార్పొరేషన్‌లో బిల్లులు నిలిచిపోవడంతో ఆ పరిస్థితి లేకుండా పోయింది. మందుల కొరతను అధిగమించేందుకు కార్పొరేషన్‌ అధికారులు ఇప్పటికప్పుడు ఆర్డర్లిచ్చినా సరఫరా చేసే పరిస్థితుల్లో కంపెనీలు లేవు. కనీసం ఐదారు నెలలు పడుతుందని అంటున్నారు. దీంతో మరో నెల రోజుల్లో రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉండనుంది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *