[spt-posts-ticker]

కుటుంబాన్ని కబళించిన కరోనా

ఒకే కుటుంబంలో ముగ్గురి మరణం

కుమారుడి పరిస్థితి కూడా విషమం

విజయవాడ, (ఆరోగ్యజ్యోతి) : కరోనా ఓ కుటుంబాన్ని కబళించింది. రోజుల వ్యవధిలో ముగ్గురిని బలి తీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఓ కుటుంబం కొన్నాళ్ల క్రితం విజయవాడ వచ్చి స్థిరపడ్డారు. కుటుంబ పెద్ద నగరంలో ప్రముఖ సివిల్‌ న్యాయవాదుల్లో ఒకరు. ఆయన భార్య, తల్లి, కుమారుడుతో కలిసి నర్సీపట్నంలో సెప్టెంబరు 28న జరిగిన ఓ ఉత్సవానికి వెళ్లారు. అక్టోబరు 2 తేదీ నుంచి లాయర్‌ తల్లి, కుమారుడుకి జలుబు, జ్వరం లక్షణాలు కనిపించాయి. వారిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. వారితోపాటు ప్రయాణం చేసిన లాయర్‌ భార్యకు పరీక్షలు చేయించగా తొలుత నెగిటివ్‌ వచ్చింది. తర్వాత ఆమెలోనూ లక్షణాలు కనిపించగా విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత కొద్దిరోజులకు లాయర్‌కు కూడా కరోనా లక్షణాలతో మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. అక్టోబరు 8న లాయర్‌ తల్లి కన్నుమూశారు. అక్టోబరు 30న ఆయన భార్య మరణించారు. ఆమె అంత్యక్రియలను మచిలీపట్నంలో శనివారం నిర్వహిస్తున్న సమయంలోనే లాయర్‌ కూడా తుదిశ్వాస విడిచారు. వారి కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స చేస్తున్నారు. రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలో ముగ్గురు కరోనాకు బలికావడంతో బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *