[spt-posts-ticker]

కేసీఆర్‌ బతికున్నంతవరకూ ఎవరికీ కష్టంరాదు

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): కేసీఆర్‌ బతికున్నంతవరకూ తెలంగాణలో ఎవరికీ ఎలాంటి కష్టం రానివ్వబోనని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురొచ్చినా వందశాతం మన బిడ్డలను ఆదుకొంటామని స్పష్టంచేశారు. వారి భోజనానికి ఎలాంటి ఇబ్బంది రానివ్వబోమని, జబ్బు పడితే మందులకు ఇబ్బంది రానివ్వబోమని హామీ ఇచ్చారు. కార్మికులకు అసౌకర్యం కలుగనీయబోమని, ఎవరికైనా పని దొరకడంలేదంటే 15 రోజులకు సరిపడా రేషన్‌ సరఫరాచేయడానికి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. శనివారం ప్రగతిభవన్‌లో మీడియాతో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ పరిస్థితులను వెయ్యి కండ్లతో పరిశీలిస్తున్నామని చెప్పారు.

ప్రజలెవరూ ఒక్క పైసా ఎవరూ ఖర్చు పెట్టేపనిలేదని, ఐదువేలు కాకపోతే పదివేల కోట్ల రూపాయలైనా ఖర్చు పెడతామని స్పష్టంచేశారు. ‘హానెస్ట్‌గా చెప్తున్నా. తెలంగాణ అదృష్టం ఏమిటంటే.. ఒక్క వ్యక్తికీ వెంటిలేటర్‌ పెట్టే పరిస్థితి రాలేదు. ఒక్క వ్యక్తి కూడా చనిపోలేదు. ఒక వ్యక్తి క్యూర్‌ అయిపోయిండు. మిగతా వాళ్లు కూడా క్యూర్‌ అవ్వాలని భగవంతుని ప్రార్థిద్దాం’ అని సీఎం చెప్పారు. పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకొంటామని, ఒకవేళ అవసరమనుకొంటే ‘టోటల్‌ షట్‌డౌన్‌’  చేస్తామన్నారు. ప్రభుత్వమే ఐదు వందలో.. రెండువేల వాహనాల్ని పెట్టి నిత్యావసర సరుకుల్ని ఇండ్లల్లోకి సరఫరా చేస్తుందని చెప్పారు. ‘వీవిల్‌ నాట్‌ గో బ్యాక్‌’ అన్నారు.

మతసామరస్యానికి దెబ్బకాదు

మత ప్రచారంలో భాగంగా కొందరు కరీంనగర్‌కి వచ్చి తిరిగి వెళ్లిపోయారని, దానివల్ల మతసామరస్యానికి దెబ్బ తగులుతుందని ఎవరూ అనుకోవద్దన్నారు. వారికి వ్యతిరేకంగా ఎలాంటి తప్పుడు ప్రచారాలు చేయవద్దన్నారు. దేవాలయాల్లో నిత్యపూజలు, నైవేద్యాలు, ఆరాధన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతున్నాయని, ఎవరైనా ఆసక్తితో హోమాలు చేయాలనుకుంటే అనుమతినిస్తామని సీఎం చెప్పారు.

సురక్షితంగా కరీంనగర్‌

కరీంనగర్‌లో యాభైవేల మందిని పరీక్షించామని, భగవంతుడి దయవల్ల ఒక్క వ్యక్తికి కూడాఎలాంటి సింప్టమ్‌ రాలేదని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘వారు రామగుండం నుంచి ఆటోలో వచ్చారు కాబట్టి, ఆ రూటులో మంచి చెడ్డ, వారెక్కడైనా మధ్యలో టిఫిన్‌ తిన్నారా? వంటి విషయాల్ని పరిశీలిస్తున్నాం. వాళ్లను తెచ్చిన ఆటోడ్రైవరుకూ ఎలాంటి పాజిటివ్‌ రాలేదు. సో ఫార్‌, కరీంనగర్‌ ఈజ్‌ సేఫ్‌’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టంచేశారు.

బుక్కెడు తిని పడుకుంటే కాదా!

‘తెలంగాణ ఉద్యమంలో సకల జనుల సమ్మె సందర్భంగా బతుకమ్మపండుగను కూడా బంద్‌ చేసినం. 24 గంటలు యాడున్నోళ్లం గాడుందాం. ఏం పోతుందయా? సచ్చిపోతమా? అందరికి అందరం బంద్‌ అయిదాం. ఏం గాదు కదా.. భూకంపం వస్తదా? ఏమైనా కొనుక్కునేది ఉంటే కొనుక్కుని ఇంట్ల పెట్టుకుని బుక్కెడు తిని సప్పుడు చేయకుండా పడుకుంటే కాదా? అందరం ఎవళ్లకు వాళ్లే ఉండిపోదాం. ఆటో లేదు.. బీటో లేదు.. ఎక్కడున్నోళ్లు అక్కడే స్టాండ్‌స్టిల్‌. ఎమర్జెన్సీ ఉంటే గవర్నమెంట్‌ ఈజ్‌ రెడీ. ఫోన్‌ చేయండి. మాట్లాడొచ్చు. చెప్పొచ్చు. ఆంబులెన్స్‌ ఉంటుంది. మెడికల్‌ షాపులుంటాయి. కాకపోతే, నైన్టీనైన్‌ పర్సంట్‌ లెట్స్‌ క్లోజ్‌ డౌన్‌. మనం అనుకుంటే చేయలేమా? అంత శక్తి సామర్థ్యాలు మనకు లేవా? కాబట్టి చేయండి’ అని సీఎం పిలుపునిచ్చారు.

పీఎం నాకే రియాక్ట్‌ అయ్యిండు

ప్రధానమంత్రి మోదీతో పదిమంది ముఖ్యమంత్రులు మాట్లాడినారని.. మార్చి 1 నుంచి విమానాలు బంద్‌చేస్తే బాగుండేది కదా అని అడిగినప్పుడు తనకే స్పందించారని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘మనది పెద్ద దేశం.. వాయుమార్గాలే కాదు జలమార్గాలున్నాయి. ఏ దేశమైనా హఠాత్తుగా బంద్‌ చేయలేం. ఒక్కొక్కటిగా బంద్‌చేసుకుంటూ వస్తున్నమని చెప్పిండు. మార్చి 22 నుంచి విమానాలన్నీ బంద్‌చేస్తున్నమని అన్నారు’ అని సీఎం తెలిపారు. ముస్లింలకు చెందిన మతపెద్దలే గ్యాదర్‌ కావొద్దని అప్పీలు చేశారని, మక్కా మసీదు వంటి చోట గ్యాదరైతే మళ్లీ చెప్పినమని సీఎం చెప్పారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *