[spt-posts-ticker]

క్యాన్సర్‌ బాధితురాలికి ఔషధాలు తెప్పించిన మంత్రి కేటిఆర్

 

  • ఢిల్లీ నుంచి హబ్సిగూడకు చేరేలా సకల ఏర్పాట్లు 

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): ఒక్క స్పందన క్యాన్సర్‌ బాధితురాలి ప్రాణాలను కాపాడింది. ఒక్క ట్వీట్‌ రవాణా సదుపాయం లేకపోయినా గురువారం ఢిల్లీ నుంచి క్యాన్సర్‌ మందులను రప్పించింది. తల్లీబిడ్డ మోములో సంతోషాన్ని నింపింది. జీవితాంతం గుండెల్లో గుర్తుంచుకొనేలా చేసింది. హైదరాబాద్‌ హబ్సిగూడకు చెందిన ఆకుల పార్వతి క్యాన్సర్‌ స్టేజ్‌-4తో బాధపడుతున్నారు. న్యూఢిల్లీలోని క్యాన్సర్‌ క్లినిక్‌ నుంచి కొరియర్‌ ద్వారా మందులు తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ అమలుతో కొరియర్‌ సేవలు నిలిచిపోయాయి. స్థానికంగా ఆ మందులు దొరకక, ఢిల్లీ నుంచి వాటిని ఎలా తెప్పించుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ విషయాన్ని పార్వతి కుమార్తె ఉషా ట్విట్టర్‌ ద్వారా ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన వెంటనే స్పందించారు. బాధితురాలికి ఎలా సహాయపడగలమో చూడాలని కార్యాలయ అధికారులను ఆదేశించారు. ఉషకు ఫోన్‌చేసిన అధికారులు పూర్తి వివరాలు సేకరించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ను సంప్రదించారు. ఆ కార్యాలయ అధికారుల సాయంతో మందులను సేకరించారు. గురువారం అత్యవసర సేవల కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఓ కార్గో విమానం బయలుదేరుతున్నట్టు తెలుసుకొన్నారు. తక్షణమే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ నుంచి మందులను హైదరాబాద్‌కు పంపించారు. సాయంత్రానికి విమానాశ్రయం నుంచి పార్వతి ఇంటికి మందులు చేరేలా కేటీఆర్‌ కార్యాలయ అధికారులు చర్యలు చేపట్టారు. అత్యవసర సమయంలో సాయంచేసిన మంత్రి కేటీఆర్‌కు ఉషా ధన్యవాదాలు తెలిపారు.

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *