ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎక్కువగా వృద్దులనే బలి తీసుకుంటోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 లక్షల మందికి పైగా వైరస్ సోకగా.. అందులో 54 వేల మంది మరణించారు. ఇందులో అత్యధికులు 60 ఏళ్ల వయసు పైబడిన వాళ్లేనని పలు స్టడీలు ప్రకటించాయి. ఈ క్రమంలో ఇటీవల కరోనాను జయిస్తూ కొద్ది మంది శతాధిక వృద్ధులు.. హీరోలుగా నిలుస్తున్నారు. ఇటలీలో గత వారం 101 ఏళ్ల వ్యక్తి కరోనా నుంచి కోలుకోగా.. తాజాగా అమెరికాలో 104 ఏళ్ల తాత కరోనా వైరస్ ను తట్టుకుని నిలబడ్డాడు. రెండో ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పోరాడిన ఈ అమెరికన్ పేరు విలియం బిల్ లాప్స్కీ.
మహమ్మారిని జయించి జన్మదిన వేడుకలు..
అమెరికాకు చెందిన ఈ 104 ఏళ్ల విలియం బిల్ కు మార్చి 5న కరోనా లక్షణాలు కనిపించాయి. జ్వరంతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడంతో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ టెస్టులు చేయగా.. మార్చి 10న కరోనా పాజిటివ్ అని తేలింది. రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన ఈ మాజీ జవాన్ ధైర్యంగా కరోనా వైరస్ ను జయించాడు. ట్రీట్మెంట్ తీసుకుని వేగంగా కోలుకున్నాడు. ఏప్రిల్ 1న తన బర్త్ డేను కుటుంబంతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అతడి కుమారులు, మనవళ్లు, ముని మనవళ్లు అంతా కలిసి సామాజిక దూరం పాటిస్తూ పుట్టిన రోజు వేడుకల్ని నిర్వహించారు. కాగా, విలియం 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి నుంచి కూడా తట్టుకుని బయటపడ్డాడు.