[spt-posts-ticker]

ఖైదీలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం

  • పునరావాసానికి తమిళనాడు తరహాలో కార్పొరేషన్‌ ఏర్పాటు యోచన
  • కుటుంబసభ్యులతో కలిసే అవకాశం కల్పించబోతున్నాం
  • జైళ్ల శాఖ డీజీ హసన్‌ అలీ

విశాఖపట్నం, ఫిబ్రవరి 24 (ఆరోగ్యజ్యోతి) ): రాష్ట్రంలోని జైళ్లలో గల ఖైదీలు  ఎంతటి అనారోగ్యానికి  గురైనా ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందజేయనున్నట్టు రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ హసన్‌అలీ తెలిపారు. విశాఖ కేంద్ర కారాగారంలో ఏర్పాటుచేసిన మసాల పొడుల తయారీ యూనిట్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరం చేయడానికి ముందు ఎంతటి ధనవంతులైనా సరే జైలుకు వచ్చాక అందరు ఖైదీలతో సమానంగానే పరిగణిస్తామన్నారు. అలాంటివారు అనారోగ్యానికి గురైనప్పుడు జైలు అధికారులు దగ్గరుండి వారిని ఆస్పత్రికి తీసుకువెళ్లి వైద్యం అందజేస్తుంటారన్నారు. ఒక్కోసారి ప్రైవేటు ఆస్పత్రుల్లో ఖరీదైన వైద్యం చేయాల్సి వచ్చినప్పుడు సమస్య తలెత్తుతున్నందున, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఖైదీలందరికీ ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించేలా అనుమతిచ్చారని తెలిపారు. ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత తిరిగి నేరాలబాట పట్టకుండా పునరావాసం కల్పించేందుకు వీలుగా తమిళనాడు తరహాలో ‘ఆఫ్టర్‌ కేర్‌’ పేరుతో ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసే యోచన ఉందన్నారు. జైళ్ల శాఖ అధికారులు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు, ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ అధికారులు కార్పొరేషన్‌లో సభ్యులుగా వుండి జైలు నుంచి విడుదలైన ఖైదీల నడవడిక, జీవన విధానాన్ని పరిశీలిస్తారన్నారు. ఖైదీలు జైలు నుంచి బయటకు వెళ్లిన తర్వాత మెరుగైన ఉపాధి అవకాశాలు దక్కించుకునేందుకు వీలుగా జైలులోనే వారికి పలు అంశాల్లో నైపుణ్యం పెంపొందించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగా కడప జైలులో మాడ్యులర్‌ ఫర్నీచర్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేయబోతున్నామన్నారు. అక్కడ మంచాలు, కుర్చీలు, కిచెన్‌లో ఉపయోగించే వస్తువులు తయారు చేసి, రాష్ట్రంలోని అన్ని జైళ్లకు సరఫరా చేస్తామన్నారు. మిగిలిన వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయించే యోచన ఉందన్నారు. రాజమండ్రి, విశాఖ జైళ్లలో వెల్డింగ్‌ యూనిట్‌లు వున్నాయని, తాజాగా మసాల పొడుల తయారీ యూనిట్‌ను ప్రారంభించామన్నారు. ఖైదీలకు నాణ్యమైన బియ్యంతో ఆహారం అందించేందుకు వీలుగా జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నేరుగా ధాన్యం కొనుగోలు చేసి బియ్యంగా మార్చేందుకు ఒక మిల్లును కూడా ఏర్పాటుచేయాలని భావిస్తున్నామన్నారు. ఖైదీలు ఇంటికి దూరంగా వున్నామనే భావనను పోగొట్టేందుకు వీలుగా జైల్లో మెరుగైన వసతులు, ఆరోగ్యం, ఆహ్లాదం కలిగించే కార్యక్రమాలు, వృత్తి నైపుణ్యంలో శిక్షణ వంటివి ఇస్తున్నామన్నారు. ఖైదీలకు వారి కుటుంబ సభ్యులందరినీ జైలులో కలిసే అవకాశంతోపాటు ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనం తినేందుకు రెండు దశల్లో అవకాశం కల్పించబోతున్నామన్నారు. వచ్చే ఆగస్టు 15న కొంతమందికి అవకాశం కల్పించే ఆలోచన ఉందన్నారు. జైళ్లశాఖలో మంచి సంస్కరణలు అమలుచేసేందుకు వీలుగా వార్డర్‌ స్థాయి నుంచి డీజీపీ స్థాయి అధికారి వరకూ ఆలోచనలు పంచుకునేందుకు వీలుగా సోమ, మంగళవారాల్లో రీట్రీట్‌ పేరుతో ఒక కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. దీనివల్ల అందరి ఆలోచనలను గౌరవించేందుకు ఒక వేదిక ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *