వైద్యుడు వసంత్ మతిస్థిమితం కోల్పోయారు: సూపరింటెండెంట్
హైదరాబాద్: రెండు, మూడు రోజులుగా సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న పరిమాణాలు తీవ్ర గందరగోళానికి దారి తీస్తున్నాయి. వైద్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలతో దుమ్మెత్తి పోసుకోవడం ప్రతిష్టాత్మక వైద్య సంస్థ పరువు తీస్తోంది. రెండు రోజుల క్రితం గాంధీకి చెందిన వైద్యుడు వసంత్ ఆసుపత్రి ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ పెట్రోలు బాటిల్‌తో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా అతను ఉన్నతాధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వాటికి సంబంధించి కొన్ని ఆధారాలను మీడియా సమక్షంగా బయట పెట్టారు. గురువారం కూడా డాక్టర్ వసంత్.. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్‌కు లక్ష్యంగా మరికొన్ని ఆరోపణలు చేశారు. దీనిపై డాక్టర్ శ్రావణ్ కూడా దీటుగా స్పందించారు. వసంత్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఒక గౌరవ ప్రదమైన వృత్తిలో కొనసాగుతూ తన స్థాయి నుంచి దిగజారి అసత్య ఆరోపణలు చేస్తూ బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. ఈ మేరకు అన్ని విభాగాల హెచ్‌వోడీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఇంటెర్నీల హాజరులో అవకతవకలు జరిగాయని వసంత్ ఆరోపించడం అసత్యమన్నారు.
గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే కొందరు వైద్యుల జీతాలు నిలిపివేశామన్నారు. కరోనా అంశంపై తాను ఆసుపత్రిలో మిగతా వైద్యులతో సమావేశం నిర్వహిస్తుండగా.. మధ్యలో అతను ఛాంబర్లోకి వచ్చి అసభ్య పదజాలంతో దూషించాడని, దీనిపై డీఎంఈకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఆసుపత్రిలోని శానిటేషన్, మెడికల్ దుకాణాలు, క్యాంటీన్ల నిర్వాహకుల వద్ద వసంత్ డబ్బులు వసూలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని శ్రావణ్ వివరించారు. వెంటనే అతనికి మానసిక నిపుణుల వద్ద పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఫిట్‌గా ఉంటే తిరిగి వైద్య బాధ్యతలు అప్పగించాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు.