హైదరాబాద్ : ఢిల్లీ, తెలంగాణలో ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రమేశ్ రెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్.. ఐసోలేషన్ వార్డు వైద్యులతో సమావేశమయ్యారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి సమాచారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదు అయిందని తెలిపారు. సదరు వ్యక్తి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి.. దుబాయి నుంచి హైదరాబాద్కు వచ్చాడు. అతని బంధువుల ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, డాక్టర్లు. ఇక ఇటీవలే బ్యాంకాక్ నుంచి ఓ సామాజిక కార్యకర్త హైదరాబాద్కు వచ్చాడు. అతనికి తీవ్రమైన దగ్గు ఉండడంతో.. గాంధీలో చికిత్స అందిస్తున్నారు. భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య -5.