- నిధులు నిలిపివేసిన అమెరికా
- కరోనా అంశంలో ఘోరవైఫల్యం
- చైనా నివేదికలనే గుడ్డిగా నమ్మింది: ట్రంప్
- తప్పుబట్టిన ఐరాస, పలు దేశాలు
వాషింగ్టన్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు తమ వంతు వాటా నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రాథమిక విధులు, తప్పనిసరి బాధ్యతలను నిర్వహించడంలో విఫలమైన డబ్ల్యూహెచ్ఓ పనితీరును సమీక్షిస్తామన్నారు. మంగళవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ ప్రాణాంతక కరోనా మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేయడంలో డబ్ల్యూహెచ్ఓ తీవ్రంగా విఫలమైందన్నారు. ‘డబ్ల్యూహెచ్ఓ నిర్వహణలో ప్రధాన పోషకురాలు అమెరికా. ఆ సంస్థ బాధ్యతాయుతంగా తన విధులు నిర్వర్తించేలా అమెరికా కచ్చితంగా చర్యలు చేపడుతుంది’ అని తెలిపారు. ‘చైనా నుంచి ఇతర దేశాలకు ప్రయాణికులపై విధించిన ఆంక్షలను డబ్ల్యూహెచ్ఓ ఘోరంగా వ్యతిరేకించింది’ అని ఆరోపించారు. అంతర్జాతీయ ఆరోగ్య ముప్పు విషయమై ప్రపంచ దేశాలన్నీ డబ్ల్యూహెచ్ఓ సమాచారంపైనే ఆధారపడతాయని ట్రంప్ చెప్పారు. కానీ వుహాన్‌లో పరిస్థితులపై వచ్చిన నివేదికల్లో విశ్వసనీయతపై దర్యాప్తు చేయడంలో డబ్ల్యూహెచ్ఓ విఫలమైందని, చైనా అధికారిక సమాచారంపైనే ఆధారపడిందన్నారు. మరోవైపు, డబ్ల్యూహెచ్ఓకు నిధులను ట్రంప్ నిలిపివేయటంపై జర్మనీ విదేశాంగశాఖ మంత్రి హైకో మాస్ బుధవారం స్పందిస్తూ.. వైరస్‌కు సరిహద్దుల్లేవని, ఇతరులను నిందించడంతో ప్రయోజనం లేదని ట్వీట్ చేశారు.
ప్రాణాలు కాపాడటంపైనే దృష్టి: డబ్ల్యూహెచ్ఓ
డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేస్తూ ట్రంప్ ఆదేశాలను జారీ చేయటంపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ నిర్ణయంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ స్పందిస్తూ.. ‘కరోనా మహమ్మారిని నిలువరించడంతోపాటు ప్రజల ప్రాణాలు కాపాడటంపైనే డబ్ల్యూహెచ్ఓ దృష్టి పెట్టింది. సమయాన్ని వృథా చేయొద్దు’ అని పేర్కొన్నారు. అమెరికా చర్య వల్ల కరోనాపై పోరాటంలో కీలకంగా ఉన్న డబ్ల్యూహెచ్ఓకు వనరులు తగ్గుతాయని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. యూరోపియన్ యూనియన్ (ఈయూ) విదేశాంగ అధిపతి జోసెఫ్ బొర్రెల్ స్పందిస్తూ.. డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేయడానికి ట్రంప్ చెబుతున్న కారణాలేవీ సమర్థనీయం కాదన్నారు. చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్ఓకు నిధులను నిలిపివేస్తూ అమెరికా నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరమని, తమ వంతు నిధులు సమకూర్చేందుకు సిద్ధమని చెప్పారు. ట్రంప్ నిర్ణయం పూర్తిగా స్వార్థపూరితం అని రష్యా మంత్రి ర్యాబ్కోవ్ వ్యాఖ్యానించారు.