- రూ.50 వేల నుంచి 2 లక్షల జరిమానా
- ఆస్తుల ధ్వంసానికి రెట్టింపు జరిమానా
- కేసు నమోదైతే బెయిల్కూడా దొరకదు
- స్పష్టం చేస్తున్న మెడికేర్ సర్వీస్ చట్టం
- గాంధీ ఘటనపై అధికారులు సీరియస్
- చట్టం అమలుకు ఐఎంఏ డిమాండ్
డాక్టర్లు, వైద్య సిబ్బందిపై దాడులు చేస్తే సహించేదిలేదు. గాంధీ దవాఖానలో వైద్యులపై దాడిచేసిన కరోనా పాజిటివ్ రోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. గాంధీ దవాఖాన, నిజామాబాద్‌లో ఘటనలవంటివి సహించబోం. కరోనా వ్యాధి వారికే పరిమితం కాదు, వారి నుంచి ఇతరులకూ వ్యాపిస్తుంది. ఈ విషయాన్ని గ్రహించి చికిత్సకు, పరీక్షలకు సహకరించాలి.
-గాంధీ ఘటనపై మంత్రి కేటీఆర్
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్యులు, ఇతర సిబ్బందిపై దాడులకు పాల్పడితే మూడేండ్ల జైలుశిక్ష తప్పదు. దీంతోపాటు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. ‘మెడికేర్ సర్వీస్ పర్సన్ అండ్ మెడికేర్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్స్ (ప్రొటెక్షన్ ఫ్రమ్ వయొలెన్స్ అండ్ డ్యామేజి ప్రాపర్టీ) చట్టం 2008 ప్రకారం దోషులకు శిక్ష పడుతుంది. ఈ కేసు నమోదైతే బెయిల్ కూడా లభించదు. ఈ చట్టం ఇప్పటికే అమలులో ఉన్నప్పటికీ, బుధవారం గాంధీ దవాఖానలో జరిగిన వైద్యులపై దాడి ఘటన నేపథ్యంలో మరింత కఠినంగా అమలుచేయాలని నిర్ణయించారు. వైద్యులు, సిబ్బందిపై దాడులకు పాల్పడినా, దవాఖానల్లో ఆస్తులను ధ్వంసంచేసినా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టంచేశారు. గతేడాది నిలోఫర్ దవాఖానలో వైద్యులపై దాడి కేసులో, లక్డీకాపూల్‌లోని కార్పొరేట్ దవాఖానపై జరిగిన దాడి కేసులోనూ నిందితులను జైలుకు పంపించినట్లు గుర్తుచేశారు. ఈ చట్టంలో నిబంధనలు ఇలా ఉన్నాయి.
- వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, పారా మెడికల్ సిబ్బంది, దవాఖానలో పనిచేసే ఇతర సిబ్బందిపై దాడులకు పాల్పడినా లేకా వారిపట్ల అసభ్యంగా, దురుసుగా ప్రవర్తించినా, బెదిరింపులకు పాల్పడినా నాన్‌బెయిలబుల్ కేసు నమోదు.
- నేరం రుజువైతే మూడునెలల నుంచి మూడేండ్ల వరకు జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం.
- దవాఖాన లేదా మెడికేర్ సర్వీస్ సంస్థల ఆస్తులను ద్వంసంచేస్తే.. నష్టపరిచిన ఆస్తుల విలువకు రెట్టింపు జరిమానాను బాధిత సంస్థకు లేదా వ్యక్తికి కోర్టు ద్వారా చెల్లించాలి. జరిమానా చెల్లించకుంటే నిందితుల ఆస్తులను రెవెన్యూ అధికారులచే జప్తుచేస్తారు.
ప్రజలు మారాలి
చట్టాలు ఎన్ని ఉన్నా వైద్యులపై దాడులు ఆగటంలేదు. ప్రజలకు వైద్యుల విలువ తెలియాలి. ఏ వైద్యుడు కూడా కావాలని రోగుల ప్రాణాలు తీయరు. గాంధీ ఘటనలో రోగి కరోనాతో బాధపడుతున్నారు. దవాఖానలో చేరే సమయానికే అతడి ఆరోగ్యం విషమించింది. గంటగంటకూ రోగి పరిస్థితిని కుటుంబసభ్యులకు తెలియజేశారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా వైద్యులు సేవచేస్తున్నారు. అలాంటివారిపై గాంధీతోపాటు, నిజామాబాద్, ఇండోర్‌లో దాడులు జరిగాయి. వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. వారు వైద్యం అందించడానికి నిరాకరిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ప్రజలు మారాలి. వైద్యులపై దాడులను ఐఎంఏ నగర శాఖ తీవ్రంగా ఖండిస్తున్నది.
– గట్టు శ్రీనివాస్, ఐఎంఏ ,హైదరాబాద్ నగర అధ్యక్షుడు
మా మనోధైర్యాన్ని దెబ్బతీస్తే మీకే నష్టం
ప్రాణాంతకమైన కరోనాకు ఎదురునిలిచి సేవచేస్తున్నాం. ఒక రకంగా మృత్యువుపై ఎదురుదాడిచేస్తున్నాం. ఇలాంటి సమయం లో మా వైద్యులపై దాడులకు పాల్పడటం సరికాదు. మా మనోధైర్యాన్ని దెబ్బతీస్తే అది మీకే నష్టం. మీకు మేమున్నామనే భావన కల్పించాలి కానీ, దాడులతో మా మనోదైర్యాన్ని దెబ్బతీస్తే ఎలా పనిచేస్తాం? అమెరికా, ఇటలీవంటి దేశాలు క్యూబా నుంచి వైద్యులను దిగుమతి చేసుకుంటున్నాయి. ఏ డాక్టర్ కూడా కావాలని రోగుల ప్రాణాలు తీయరు. వరుస దాడుల నేపథ్యంలో వైద్యులకు గన్మెన్ల అవసరం కనిపిస్తున్నది.
– డాక్టర్ శ్రావణ్‌కుమార్, సూపరింటెండెంట్, గాంధీ దవాఖాన