హైదరాబాద్: నాంపల్లి నిలోఫర్ ఆస్పత్రి ఆవరణలో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఓ వైద్యుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన ఓ కారును పక్కకు తీస్తున్న సమయంలో డ్రైవర్ లియాకత్ అలీకి ఫిట్స్ వచ్చింది. దీంతో కారు ఒక్కసారిగా అదుపుతప్పి సమీపంలో పార్క్ చేసిన ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది. అదే సమయంలో అక్కడ ఉన్న హౌస్ సర్జర్ డా.ప్రశాంత్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వైద్యుని ఎడమ చేయి, కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన జూనియర్ డాక్టర్లు చికిత్స నిమిత్తం అతన్ని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పార్కింగ్ వ్యవస్థ సరిగా లేనందువల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. అయితే నిత్యం రద్దీగా ఉండే నిలోఫర్ ఆస్పత్రి వద్ద ప్రమాద సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు.