[spt-posts-ticker]

తండ్రికి పునర్జన్మ ఇచ్చిన తనయ!

తన కాలేయంలో సగం దానం
ఏకకాలంలో గుండె శస్త్రచికిత్స, కాలేయ మార్పిడి
14 గంటలపాటు శ్రమించి ప్రాణాలు పోసిన అపోలో వైద్యులు

హైదరాబాద్‌: అన్ని బంధాలు ఆర్థిక సంబంధాలుగా మారుతున్న రోజుల్లో తన తండ్రికి పునర్జన్మ ఇచ్చిందో తనయ. తన కాలేయంలో సగభాగం దానం చేసి జన్మనిచ్చిన తండ్రికి అమ్మగా మారి ప్రాణం పోసింది. ఈ వివరాలను జూబ్లీహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో వైద్యులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్‌ నాబార్డు మాజీ అధికారి శివప్రసాద్‌ (67) ఇటీవల ఇంట్లో జారిపడగా తలకు గాయమైంది. ఆసుపత్రికి వెళ్లగా కాలేయంలో కేన్సర్‌ (లివర్‌ సిరోసిస్‌) ఉందని తేలింది. దీంతో అపోలో వైద్యులను సంప్రదించారు. శివప్రసాద్‌కు గుండెలోని కరోనరీ ఆర్టరీ బైపాస్‌ గ్రాఫ్ట్‌ (సీఏబీజీ)తో పాటు కాలేయ మార్పిడి ఒకేసారి నిర్వహించాలని వైద్యులు తేల్చారు. ఈ క్రమంలో ఆయనకు తన కాలేయంలో సగభాగం ఇచ్చేందుకు కుమార్తె రోహిణి ముందుకొచ్చారు. ఆమెకు పెళ్లై రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. తనకు ఏమైనా జరిగితే కుమారుడి భవిష్యత్తు ఏమవుతుందో అని ఉన్నా ఆమె ముందుకొచ్చారు.

14 గంటల పాటు ఏకధాటిగా…
డిసెంబరు 6న శివప్రసాద్‌కు అపోలో వైద్యులు విజయవంతంగా ఏక కాలంలో గుండె శస్త్రచికిత్సతో పాటు కాలేయ మార్పిడి చేశారు. డాక్టర్‌ మనీశ్‌ సీ వర్మ, డాక్టర్‌ నవీన్‌ పోలవరపు, డాక్టర్‌ మనోజ్‌ అగర్వాలా, డాక్టర్‌ సంజయ్‌ అగర్వాల్‌లతో కూడిన వైద్యుల బృందం ఈ ప్రక్రియను విజయవంతం చేసింది. ‘ఆయన గుండెలోని కుడి వైపు కరోనరీ ఆర్టరీ దాదాపు 99 శాతం వరకు పూడుకుపోయింది. ఈ పరిస్థితిలో కాలేయ మార్పిడి చేయడం చాలా కష్టం. ‘తొలుత గుండె శస్త్రచికిత్స చేసి విజయవంతం కావడంతో.. వెంటనే కాలేయ మార్పిడి చికిత్స చేశాం’ అని వైద్యులు వివరించారు. ఇలాంటి శస్త్రచికిత్సలు అరుదుగా జరుగుతుంటాయన్నారు. ‘అమ్మానాన్నలు మనకు అన్నీ ఇస్తారు. తాము ఎన్ని కష్టాలు పడినా పిల్లలను ఉన్నతంగా చూడాలని కలలు కంటుంటారు. వారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం ఏమీ అడగరు. ముఖ్యంగా ఏ తండ్రీ తన బిడ్డను కాలేయం దానం చేయాలని అడగడు. మనమే అర్థం చేసుకోవాలి.. మేమున్నామంటూ అండగా నిలవాలి’ అని రోహిణి పేర్కొన్నారు. తండ్రి, కుమార్తె పూర్తిగా కోలుకోవడంతో డిశ్ఛార్జి చేశామని వైద్యులు పేర్కొన్నారు

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *