తెలంగాణ రాష్ట్రంలో తల్లీబిడ్డల సంరక్షణకు కేసీఆర్ కిట్ పథకం సమర్థంగా ఉపయోగపడుతోందని, కంగారూ తల్లి సంరక్షణ విధానం అమలూ మెరుగ్గా ఉందని కేంద్ర ఉమ్మడి పరిశీలన బృందం (సీఆర్ఎం) పేర్కొంది. ఇతర వైద్యసేవలు ఈ స్థాయిలో అందడంలేదని, వాటిని మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని సూచించింది. రాష్ట్రంలో సిజేరియన్లు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని, తద్వారా పుట్టగానే తొలి గంటలోపు శిశువుకు అందించాల్సిన తల్లిపాలు అందడంలో జాప్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. జాతీయ ఆరోగ్య మిషన్ పథకాల అమలుతీరు పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం 2018 సెప్టెంబరు 5 నుంచి అక్టోబరు 14 వరకూ దేశంలోని 19 రాష్ట్రాల్లో పర్యటించింది. ఒక్కో రాష్ట్రంలో ఎంపిక చేసిన 2 జిల్లాల్లో వైద్యసేవలను పరిశీలించింది. తెలంగాణలో జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాల్లో పరిశీలన జరిపింది. 12వ సీఆర్ఎం నివేదికను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు
* తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లోని మహిళల్లో సురక్షిత గర్భస్రావాలపై అవగాహన కొరవడింది. వైద్యులు, నర్సుల కొరత తీవ్రంగా ఉంది.
* టీనేజీ ఆరోగ్యంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలు మెరుగైన పనితీరు కనబరుస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు ఆశించిన స్థాయిలో పనిచేయడంలేదు.
* పునరుత్పత్తి వయసు మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది.
సిఫార్సులు
* గర్బిణిగా సమయంలో ఆరోగ్య సమస్యలున్న మహిళలకు చికిత్సలపై ప్రత్యేక దృష్టి అవసరం.
* వైద్య సిబ్బందికి నాణ్యమైన సేవలపై ఎప్పటికప్పుడు శిక్షణ ఇప్పించాలి.
* జిల్లా ఆసుపత్రుల్లో రద్దీ తగ్గించడానికి సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్టులను తగినంతగా నియమించాలి.
* నాణ్యమైన గర్భస్రావ సేవలను అందించాలి. అందుకనుగుణంగా ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
* నిర్దేశిత తేదీల్లో కచ్చితంగా కుటుంబ నియంత్రణ సేవలు లభించేలా కార్యాచరణ అమలుచేయాలి.
* నవజాత శిశు సంరక్షణ కేంద్రాలపై నెలవారీగా సమీక్షలు నిర్వహించాలి.
* శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టడంతో పాటు 6 నెలల వరకూ తల్లిపాలు ఇచ్చేవిధంగా అవగాహన కల్పించాలి.