[spt-posts-ticker]

తెలంగాణలో వైద్యసేవలు అద్భుతం

  • ఇతర రాష్ర్టాలు అనుసరించాలి
  • నీతిఆయోగ్‌ సభ్యుల ప్రశంసలు
  • గజ్వేల్‌ ప్రభుత్వ దవాఖానను సందర్శించిన బృందం

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి): ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నదని నీతిఆయోగ్‌ బృందం ప్రశంసించింది. గ్రామీణప్రాంతాల్లో ప్రభుత్వ వైద్యసేవలు అద్భుతంగా ఉన్నాయని, ఇలాంటి కృషిని దేశంలో మరెక్కడా చూడలేదని కొనియాడింది.  తెలంగాణలో అమలవుతున్న విధానాలను ఇతర రాష్ర్టాల్లోనూ అమలుచేయాలని పేర్కొంది.  ఏడుగురు సభ్యులతో కూడిన నీతిఆయోగ్‌ బృందం రెండ్రోజుల రాష్ట్ర పర్యటనలో భాగంగా సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని ప్రభుత్వ దవాఖానతోపాటు సమీపంలోని రాయపోల్‌ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించింది. గజ్వేల్‌ దవాఖానలోని పాలియేటివ్‌కేర్‌ సెంటర్‌ (ఉపశమన సంరక్షణ కేంద్రం) లో చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి, ఇక్కడ అమలుచేస్తున్న విధానాలు, పద్ధతులపై ఆరా తీశారు. అనంతరం వైద్యులతోనూ మాట్లాడి వివరాలు తెలుసుకొన్నారు. క్యాన్సర్‌, పక్షవాతం బాధితులకు ఏవిధమైన చికిత్సలు అందిస్తున్నారు? వారు ఎలా కోలుకొంటున్నారు? తదితర విషయాలు తెలుసుకొని వైద్యులను అభినందించారు.

 

గ్రామీణప్రాంత ప్రజలకు ఇలాంటి దవాఖానల ద్వారా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య, ఆరోగ్యశాఖ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా నీతిఆయోగ్‌ బృంద సభ్యుడు రాజేశ్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణలో రెండ్రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో, సోమవారం సిద్దిపేట జిల్లాలో పర్యటించినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైద్యసేవలు అద్భుతంగా ఉన్నాయని, దేశం మొత్తం ఇక్కడి విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు.  రాష్ట్రంలోని పీహెచ్‌సీ లు, సబ్‌సెంటర్లు, దవాఖానల్లో రోగులకు అందతున్న వైద్యసేవలు, తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డాక్టర్‌ రాజేశ్‌సాగర్‌, డాక్టర్‌ అశోక్‌, సుధాకర్‌, జిల్లా మలేరియా అధికారి కాశీనాథ్‌, సూపరింటెండెంట్‌ మహేశ్‌, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *