కొత్త కేసులు – 75
మరణాలు – 02
మొత్తం కేసులు: 229
మొత్తం మరణాలు: 11
తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న వైరస్
229కి చేరిన మొత్తం కేసుల సంఖ్య
హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి)): రాష్ట్రంలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 75 కేసులు నమోదు అయ్యాయి. ప్రతి గంటకు మూడు కొత్త కేసుల చొప్పున నమోదు కావడం వైద్య ఆరోగ్య శాఖకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. శుక్రవారం నమోదైన 75 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా 229కి చేరింది. నాలుగు రోజుల వ్యవధిలోనే 147 కేసులు నమోదు కావడం గమనార్హం. శుక్రవారం కరోనాతో ఇద్దరు చనిపోయారు. ఒకరు రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూర్ గ్రామానికి చెందిన మహిళ(55) కాగా మరొకరు సికింద్రాబాద్‌కు చెందిన వ్యక్తి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 11కు చేరింది. శుక్రవారం ఆరు ల్యాబ్‌లలో 24 గంటల పాటు మూడు షిప్టుల్లో సుమారు 400 నమూనాలు సేకరించారు. దాంట్లో 75 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అంటే, సేకరించిన నమూనాల్లో పాజిటివ్ కేసుల శాతం 18.75గా నమోదైంది. అవన్నీ కూడా మర్కజ్‌తో సంబంధమున్నవేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. చేగూర్‌లో కిరాణం దుకాణం నిర్వహించే మహిళ ఇంట్లో అద్దెకు ఉండే బిహారీలు గత నెల 18న స్వగ్రామం నుంచి రైల్లో హైదరాబాద్‌కు వచ్చారు. అదే రైల్లో మర్కజ్ నిజాముద్దీన్ యాత్రికులు ఉన్నారని, వారి నుంచి రైల్లో ఉన్న బిహారీ కార్మికులకు, బిహారీల నుంచి ఇంటి యజమానురాలికి కరోనా అంటి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వారంతా చేగూరు పక్కనే ఉండే కన్హ ఆశ్రమంలో పని చేస్తున్నారు. ఆమె కుమారుడు కూడా అదే ఆశ్రమంలో పని చేస్తున్నారు. సికింద్రాబాద్ మృతుడు జీహెచ్ఎంసీ ఉద్యోగి. పలు అనారోగ్య సమస్యలు ఉండటంతో మూడు నెలలుగా విధులకు రావడం లేదు. ఆరోగ్యం బాగోలేక పోవడంతో గాంధీ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఉస్మానియాకు తరలించారు. అక్కడ అనుమానంతో పరీక్షలు చేయగా, కరోనా ఉన్నట్లు తేలింది. ఆయనకు ఢిల్లీ మర్కజ్ నిజాముద్దీన్‌తో ఎలాంటి సంబంధమూ లేదు. కరోనా ఎక్కడి నుంచి వచ్చిందో తేలాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శనివారం మరో 600 మందికి పరీక్షలు నిర్వహించనుంది. ప్రస్తుతం పాజిటివ్ కేసుల శాతం ఆధారంగా మరో 112 కేసులు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇదే ఒరవడి కొనసాగితే ఆదివారం నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 500 దాటుతుందని అంచనా. మరణాల రేటు కూడా పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల నుంచి వచ్చిన కేసులు కేవలం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు పరిమితం అయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన వారితోనూ మార్చి 27 వరకు కేసులు ఐదారు జిల్లాలకే పరిమితమయ్యాయి. తాజాగా మర్కజ్ కేసులు రాష్ట్రమంతటా విస్తరించాయి. ఒకటి రెండు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్‌లో 30, వరంగల్‌లో 19, కరీంనగర్లో 17, సంగారెడ్డిలో 6, నల్గొండలో 6, కామారెడ్డిలో 4, గద్వాలలో 4 కేసులు నమోదయ్యాయి.