- ప్రజలు ఒకేసారి రోడ్లపైకి రాకుండా చూడాలి
- కొన్ని దేశాల్లో రెండోసారీ కరోనా వస్తుందంటున్నారు
- తక్కువ ప్రాణనష్టంతో బయటపడటమే లక్ష్యం
- ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ, (ఆరోగ్యజ్యోతి): లాక్డౌన్ను దశల వారీగా ఉపసంహరించాలని, దానికి ఉమ్మడి వ్యూహం రూపొందించడం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రజలంతా ఒకేసారి రోడ్లపైకి చొచ్చుకురాకుండా దఫదఫాలుగా వచ్చేట్లు చూడాలని చెప్పారు. దీనిపై లోతుగా ఆలోచించి సూచనలు పంపాలని ముఖ్యమంత్రులను కోరారు. కరోనా వైరస్ నియంత్రణకు వచ్చే కొద్ది వారాల్లో వైద్య పరీక్షలు, బాధితుల గుర్తింపు, ఐసొలేషన్, క్వారంటైన్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించారు. హాట్స్పాట్లను గుర్తించి వైరస్ వ్యాప్తి చెందకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పారు. లాక్డౌన్ ముగిశాక కూడా భౌతిక దూరం పాటించేలా రాష్ట్రాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు, మరణాలు పెరిగిన నేపథ్యంలో గురువారం ప్రధాని సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ‘‘యావత్ జాతిని కలవరపరుస్తున్న కరోనాను నియంత్రించేందుకు రాష్ట్రాలన్నీ కేంద్రంతో కలిసి సమష్టిగా, సమర్థంగా పనిచేయడం ప్రశంసనీయం. రాజకీయాలకు అతీతంగా ఈ మహమ్మారిపై యుద్ధం చేద్దాం. మనం తీసుకున్న ముందస్తు జాగ్రత్త, వైద్య నిర్వహణ చర్యలతో అతి తక్కువ ప్రాణనష్టంతో బయటపడటమే మన ముందున్న ప్రధాన లక్ష్యం’’ అన్నారు. కరోనాపై యుద్ధంలో రాష్ట్రాలన్నీ తమ వంతు సహకారం అందిస్తున్నందుకు సీఎంలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రాల వారీగా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. కరోనాపై యుద్ధంలో మత నాయకులను, వివిధ సంఘాలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో బయటపడిన కరోనా కేసులపై ఆరా తీశారు.
ఔషధాలు, వైద్య పరికరాలు, అవసరమైన ముడి సరుకులను సమకూర్చుకోవాలని, అన్ని వైద్య సౌకర్యాలతో ఆస్పత్రులను సిద్ధం చేయాలన్నారు. వైద్యుల సంఖ్యను పెంచుకోవాలని, ఆయుష్ వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎ్సఎస్ వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. జిల్లాస్థాయిలో విపత్తు నిర్వహణా బృందాలను ఏర్పాటు చేయాలని, జిల్లా సర్వైలెన్స్ అధికారులను నియమించాలన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా లాక్డౌన్ నుంచి వారికి కొన్ని మినహాయింపులు ఇస్తూనే, వ్యవసాయ పనుల సమయంలో రైతులు, కూలీలు భౌతిక దూరం పాటించేలా చర్య లు చేపట్టాలని చెప్పారు. పంటలను అమ్ముకోవడానికి మార్కెట్ కమిటీలే కాకుండా గ్రామాల్లో కూడా కొత్తగా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కరోనా కట్టడికి నిరంతరం తమతో సంప్రదింపులు జరుపుతూ, సూచనలిస్తూ సహకరిస్తున్నందుకు ప్రధానికి సీఎంలు కృతజ్ఞతలు తెలిపా రు. సరైన సమయంలో ధైర్యంగా లాక్డౌన్ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. దీని వల్ల కరోనాను నియంత్రించగలుగుతున్నట్లు పలువురు సీఎంలు ప్రధానికి తెలిపారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, హర్షవర్ధన్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా, హోం, ఆరోగ్య శాఖల కార్యదర్శులు అజయ్ కుమార్ బల్లా, ప్రీతి సుడాన్, సీఎంలతో పాటు ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, హోం, ఆరోగ్య శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం ఉదయం 9 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ఓ చిన్న వీడియో సందేశాన్ని విడుదల చేయనన్నట్లు మోదీ ట్విటర్లో తెలిపారు.