[spt-posts-ticker]

దుబాయ్‌ ప్రయాణికుడికి కరోనా

  • హైదరాబాద్‌లో వ్యాధి నిర్ధారణ, గాంధీ దవాఖానలో చికిత్స
  • కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం
  • మన వాతావరణంలో వైరస్‌ విస్తరించదు
  • వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడి
  • ఢిల్లీ, రాజస్థాన్‌లో ఒక్కొక్కరికి కరోనా

హైదరాబాద్‌: ప్రపంచదేశాలను వణికిస్తున్న మహమ్మారి వ్యాధి కరోనా ఓ దుబాయ్‌ ప్రయాణికుని ద్వారా హైదరాబాద్‌ చేరింది. గాంధీ దవాఖానలో ఆ వ్యక్తికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో కొవిడ్‌-19 (కరోనా) వ్యాధి ఉన్నట్టు తేలింది. ఢిల్లీలో ఒకరికి, రాజస్థాన్‌లో ఓ ఇటలీ పర్యాటకునికి కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఢిల్లీవాసి కూడా ఇటీవల ఇటలీ వెళ్లివచ్చినట్టు అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన భారతీయుల సంఖ్య ఐదుకు చేరింది. ఇంతకుముందు కేరళకుచెందిన ముగ్గురు విద్యార్థులకు వైరస్‌ సోకగా, వారు చికిత్స పొంది దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. హైదరాబాద్‌లో వ్యాధినిర్ధారణ అయిన వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అని, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, భయాందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో తొలి కరోనా కేసు నమోదైన నేపథ్యంలో అది ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నదని చెప్పారు. డీఎంఈ కార్యాలయంలో మంత్రి రాజేందర్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు. బెంగళూరులో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి కంపెనీ పనిమీద గతనెల 15న దుబాయ్‌ వెళ్లారని చెప్పారు. అక్కడ ఐదు రోజులు వివిధ దేశాలవారితో కలిసి పనిచేసిన ఆయన తిరిగి 20న బెంగుళూరుకు, అక్కడి నుంచి 22న  హైదరాబాద్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఆ యవకుడికి జ్వరం రావడం తో తొలుత అపోలో దవాఖానలో వైద్య సేవ లు పొందారని తెలిపారు. ఎంతకూ జ్వరం తగ్గకపోవడంతో ఆదివారం సాయంత్రం గాంధీ దవాఖానకు వచ్చారని చెప్పారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా లక్షణాలు కనిపించాయన్నారు. ఆయన రక్త నమూనాలను పుణెకు పంపగా, కేంద్ర ఆరోగ్య విభాగం కరోనా వ్యాధి ఉన్నట్టు తేల్చిందని తెలిపారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు కరోనాను ఎదుర్కొనేందుకు అప్రమత్తమయ్యామని ఈటల చెప్పారు. గాంధీ, ఫీవర్‌, చెస్ట్‌ దవాఖానల్లో 40 బెడ్ల సామర్థ్యంతో ఇదివరకే ఐసొలేషన్‌ వార్డులను అందుబాటులో ఉంచామని చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన సదరు యువకుడిని గాంధీలోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

80 మందిని ట్రాక్‌లోకి..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయిన నేపథ్యంలో ఆయనతో గడిపిన వారందరిని ట్రాకింగ్‌ చేస్తున్నామని మంత్రి రాజేందర్‌ చెప్పారు. ఆయన  తిరిగిన ప్రదేశాలు, కుటుం బసభ్యులు, వైద్యసేవలందించిన అపోలో దవాఖాన సిబ్బంది, బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తోటి ప్రయాణికులు మొత్తం 80 మందిని గుర్తించామని మంత్రి తెలిపారు. అయితే వారందరికీ వైరస్‌ ఉన్నట్టు కాదని, ముందుజాగ్రత్త చర్యగా వారికి వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పారు. కరోనా వైరస్‌ కారణంగా దేశంలో ఎవరూ చనిపోలేదని, ఆ వ్యాధి లక్షణాలు ఉంటే తక్షణం దవాఖానల్లో సంప్రదించాలని మంత్రి కోరారు.

వ్యక్తిగత పరిశుభ్రతతో

వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా కరోనా వైరస్‌ బారి నుంచి తమను తాము కాపాడుకోవచ్చని మంత్రి రాజేందర్‌ పేర్కొన్నారు. ఈ వైరస్‌ స్పర్శ, గాలివల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని, ముందుజాగ్రత్తలు పాటించాలని సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం వంటివి ఉన్నవారు జన సమూహాలు ఉండే ప్రదేశాల్లో తిరుగొద్దని చెప్పారు. తెలంగాణలో ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఈ వ్యాధి విస్తరించే అవకాశం లేదని చెప్పారు. ఇక్కడ 33 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని, ఈ కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదని ఈటల వెల్లడించారు.

అధికారులతో అత్యవసర భేటీ

రాష్ట్రంలో కరోనా కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం అత్యసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కొవిడ్‌ వైరస్‌ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం వంటివి చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకుగాను కరపత్రాలు ముద్రించి పంచాలని నిర్ణయించారు. కొత్తగా వంద పడకల సామర్థ్యంతో మిలిటరీ దవాఖానలో ఐసోలేషన్‌ వార్డును అందుబాటులోకి తీసుకురావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కరోనాపై అన్ని యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది.

గాంధీలో ప్రత్యేక వైద్య బృందం

కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సనందించేందుకు గాంధీ దవాఖానలో అన్ని ఏర్పాట్లు చేశామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రవణ్‌కుమార్‌ తెలిపారు.  అనుమానితులను ఉంచేందుకు మొత్తం 40పడకలు, 10వెంటిలేటర్లతో కూడిన ఐసొలేషన్‌ వార్డులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన వారికోసం 10 పడకలతో కూడిన ఐసీయూ వార్డును ఏర్పాటు చేశామని తెలిపారు. వారికి చికిత్స అందించేందుకు కేంద్రం నుంచి ఐదుగురు వైద్యుల బృందం, గాంధీకి చెందిన మరో ఐదుగురు నిపుణులతో ప్రత్యేక వైద్య బృందాన్ని సిద్ధంగా ఉంచినట్టు చెప్పారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *