[spt-posts-ticker]

నగరంలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులకూ షోకాజ్ నోటీసులు

  • వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి);‌హైదరాబాద్‌లోని దాదాపు అన్ని కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆసుపత్రుల దోపిడీ, ఎక్కువ ఫీజుల వసూలు, బెడ్‌ల కృత్రిమ కొరతను సృష్టించడం లాంటి ఫిర్యాదులు ప్రజల నుంచి రావడంతో షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరినట్లు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆసుపత్రులు ఇచ్చిన వివరణలను పరిశీలించడానికి వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వివరణలను పరిశీలించిన అనంతరం తప్పులు చేసినట్లు రుజువైతే ఆ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోక తప్పదని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు కూడా జారీచేశారు. కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో కూడా కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగిందని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం సమర్థించిందని, అవసరమైతే ఎపిడమిక్ ఆక్ట్ కింద మరింత కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సూచించిందని మంత్రి తెలియజేశారు.కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులు వాటి తీరును మార్చుకోవడానికి మంత్రి మరో అవకాశం ఇచ్చారు. తీరు మార్చుకోకుండా ఇకపై కూడా ఇలాగే వ్యవహరిస్తే ప్రతీ కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న ఐసీయూ సహా అన్ని వార్డుల్లో 50శాతం బెడ్‌లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా చికిత్సలు జరపటానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులపై ప్రజల నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సచివాలయంలో సమీక్ష నిర్వహించిన అనంతరం పై నిర్ణయాలు తీసుకున్నారు.ఇప్పటివరకు కార్పొరేటు, ప్రైవేటు ఆసుపత్రులమీద ప్రజల నుంచి 1,039 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఎక్కువగా హెచ్చు మొత్తంలో బిల్లులు వేయడం, బిల్లులు ఇవ్వకుండానే డబ్బులు వసూలు చేయడం, మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల మేర అడ్వాన్స్ రూపంలో ముందుగానే వసూలు చేసుకోవడం, ఆ మేరకు చెల్లిస్తే తప్ప ఆసుపత్రుల్లో చేర్చుకోకపోవడం, చెల్లించనివారికి బెడ్‌లు ఖాళీ లేవంటూ కృత్రిమ కొరతను సృష్టించడం.. ఇలాంటివే ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. చాలా సందర్భాల్లో పేషంట్లకు కనీసం పరీక్ష కూడా చేయకుండానే తిప్పి పంపిస్తున్నట్లు తేలిందని గుర్తుచేశారు.వీటికి తోడు హెల్త్ ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా చేసే చెల్లింపులను అంగీకరించకపోవడం, డబ్బులు చెల్లించినా కూడా రోగులను సరిగా పట్టించుకోకపోవడం, ఒకవేళ పేషెంట్ చనిపోతే డబ్బులు చెల్లించిన తర్వాతనే డెడ్‌బాడీ ఇస్తామంటూ షరతు పెట్టి కనీసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా చూపకపోవడం లాంటి పలు ఫిర్యాదులు అందినట్లు మంత్రి పేర్కొన్నారు. కరోనా లేనివారి దగ్గర కూడా కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి పరీక్షల పేరుతో డబ్బులు వసూలు చేయడంపై కూడా పలు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఇతర జబ్బుల కోసం చికిత్స చేయించుకోవడానికి వచ్చినవారిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ‘కరోనా ప్యాకేజ్’ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా కొన్ని లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయని వివరించారు.వాస్తవానికి కరోనా నిర్ధారణ కోసం రాపిడ్ పరీక్ష లేదా ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతులు ఉన్నా వాటిని పక్కనపెట్టి సీటీ స్కాన్, ఎక్స్‌రే, రక్త పరీక్షల పేరుతో పేషెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అవసరం లేకున్నా డబ్బుల కోసం చాలా రకాల పరీక్షలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని కూడా మంత్రి వివరించారు. వీటన్నింటిని నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన కమిటీ వెలువరించే సిఫారసుల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *