[spt-posts-ticker]

నర్సింగ్‌ హోంలపై..చిన్నచూపు!

ప్రశ్నార్ధకంగా నర్సింగ్‌ హోంల భవిత

 ప్రభుత్వ, ప్రైవేటు ఇన్స్యూరెన్సులు అన్నీ కార్పొరేట్‌లకే..

కార్పొరేటు ఆస్పత్రుల బాటలో మధ్యతరగతి

 ప్రభుత్వ ఆరోగ్య పథకాలూ.. పెద్ద ఆస్పత్రులలతోనే..

నర్సింగ్‌హోంలు నడిపేవారికి అందని ప్రోత్సాహం

భవిష్యత్తులో ఫ్యామిలీ ఫిజిషియన్‌ కనుమరుగేనా?

కొన్ని దశాబ్దాల నుంచి మన సంస్కృతిలో ఒక వైద్యుడిని నమ్ముకోవడం, కుటుంబం మొత్తం అతని వద్దే చికిత్స పొందడం, మెరుగైన చికిత్సకైనా అతని సలహాపైనే వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అనవసరపు పరీక్షలు లేకుండా కేవలం వైద్యానికే ప్రాధాన్యం ఇస్తూ ఈ విధంగా అనేకమంది వైద్యులు ప్రజల దృష్టిలో దేవుళ్లుగా నిలిచిపోయారు. ప్రస్తుతం వైద్య రంగంలో కార్పొరేట్ల పెట్టుబడి రావడంతో ఆధునిక వైద్య చికిత్సలు అందుబాలోకి వచ్చాయి. దీంతో ప్రజలు అటువైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో సొంతగా ప్రాక్టీస్‌ నిర్వహించుకుంటూ నర్సింగ్‌ హోమ్‌ నడుపుకొనే వైద్యులకు ప్రతిబంధకంగా మారింది.

గుంటూరు: ఫ్యామిలీ డాక్టర్‌.. అనే మాట కనుమరుగు కానుందా..?  వైద్య రంగంలో కార్పొరేట్‌ సంస్కృతి రావడం సొంతగా ప్రాక్టీస్‌ నిర్వహించుకుంటూ నర్సింగ్‌ హోమ్‌ నడుపుకొనే వైద్యులకు ప్రతిబంధకంగా మారిందా..? దీనికి అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు వైద్య రంగంపై ప్రభుత్వాలు ఎక్కువ దృష్టి పెట్టలేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు , కొన్ని కార్పొరేట్‌ కంపెనీల్లో ఉద్యోగులకు మాత్రమే ఈ ఇన్స్యూరెన్స్‌ సదుపాయం ఉండేది. ఆ తర్వాత కాలంలో దేశంలోకి ప్రవేశించిన సంస్కరణల పుణ్యమా అని ప్రైవేటు రంగంలో కూడా ఇన్స్యూరెన్స్‌ పెట్టుబడులు వచ్చాయి. దీంతో 60 నుంచి 70 శాతం మధ్యతరగతి వారు ఈ సదుపాయాన్ని కలిగి ఉంటున్నారు. నేరుగా బ్యాంక్‌లు, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా దీనిలో భాగస్వాములు కావడంతో ఈ లోను, మరే ఇతర పనులు కావాలన్నా ఇన్స్యూరెన్స్‌ తప్పనిసరి అంటూ చెప్పడంతో ఎక్కువ మంది దీనిలో భాగస్వాములు అయ్యారు. ఇన్స్యూరెన్స్‌ ద్వారా ఒక ఆసుపత్రి చికిత్సలు చేయాలి అంటే ఆ ఆసుపత్రిలో కనీసం 50 బెడ్‌లు ఉండాలి. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా చూడాలి. కనీసం కొన్ని విభాగాలకైనా చికిత్సను అందించాలి. ఈ నిబంధనలు నర్సింగ్‌ హోమ్‌ నిర్వహించే వారికి ప్రతిబంధకంగా మారాయి.

ఇద్దరు వైద్యులతో క్లినిక్‌

నర్సింగ్‌ హోమ్‌ అంటే ఇద్దరు వైద్యులు కనీసం ఎంబీబీఎస్‌ అర్హతతో ఐదు బెడ్‌లతో నిర్వహించుకునే వీలు ఉంది. ఎక్కువశాతం ఒక్కరు లేదా భార్య భర్తలు కలిపి నిర్వహించుకుంటారు. ఇద్దరు కూడా ఒకే రంగంలో నిపుణులు కారు.. చెరో విభాగంలో నిపుణులు అయిన వైద్యులు అవుతారు. రెండు దశాబ్దాల క్రితం వరకు అటువంటి వారికి మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఇన్సూరెన్స్‌ సదుపాయం కలిగిన వారు 90 శాతంకుపైగా ఉండటంతో ఆ సదుపాయం ఉన్న ఆసుపత్రులకే వెళ్లి చికిత్సలు చేయించుకుంటున్నారు. వైద్యునిపై ఎంత నమ్మకం ఉన్నప్పటికీ డబ్బులు ఇన్స్యూరెన్స్‌ కంపెనీలు చెల్లించడంతో ఇష్టం ఉన్నా లేకపోయినా నెట్‌వర్క్‌ ఆసుపత్రుల వైపే ప్రజలు వెళ్లడం కూడా తప్పనిసరిగా మారింది. దీంతో నర్సింగ్‌ హోమ్‌లు కొన్నాళ్లకైనా అలంకారంగా మారుతాయని ఎక్కువ మంది వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

సొంత ప్రాక్టీసు  భారమే..

పదిరోజుల కిందట తెలంగాణాలో ఏ నర్సింగ్‌ హోం వైద్యుడు నిర్వహణలో నష్టాల బారిన పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సందర్భంలో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా ఇన్స్యూరెన్స్‌ నిబంధనలను తప్పు పట్టింది. బెడ్‌లు, వైద్యులు సంఖ్యతో ముడి పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఆ సదుపాయం కల్పించాలని సిఫార్సు చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వినతులు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు స్పందించడం లేదు. దీంతో సొంతగా ప్రాక్టీస్‌ చేస్తూ రోగులపై ఎక్కువ భారం పడకుండా సేవా భావంతో వైద్యం చేద్దామనుకునే వారికి కూడా ప్రస్తుత పరిస్థితులు, నిబంధనలు ఎదురొడ్డుతున్నాయి.

 

కార్పొరేట్‌లో పరీక్షల పేరుతో దోపిడీ

కార్పొరేట్‌లకు వెళ్లడం తప్పనిసరి కావడంతో పరీక్షల పేరుతో దోపిడీ పెరుగుతుంది. వైద్యుడు రోగిపై ఎంతోకొంత సానుభూతి కలిగి పరీక్షలు అవసరం లేదనుకొని చేద్దామనుకున్నా చేయలేని పరిస్థితి.. కారణం కార్పొరేట్‌ కౌగిలిలో డాక్టర్‌ బందీ కావడమే. దీనికి తోడు కార్పొరేట్‌ ఆసుపత్రులకు పరీక్షలకు అవసరమయ్యే పరికరాలు తయారుచేసే కంపెనీలు టార్గెట్‌లు పెడుతున్నాయి. తమ కంపెనీ తయారు చేసిన మిషనరిని ఉచితంగా మీ ఆసుపత్రికి ఇస్తాం. దానికి అవసరమైన పరీక్ష కిట్‌లు మా వద్దే కొనాలి అని ఒప్పందం చేసుకుంటున్నాయి. కనీసం ఇన్ని కిట్‌లు అయినా కొనకపోతే మిషనరి తీసివేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నాయి. దీంతో అవసరం ఉన్నా లేకపోయిన పరీక్షలు రాయాల్సిన దుస్థితి వైద్యులకు నెలకొంది.

పూటకో రేటు..?

మనకు ఇంకా ప్రారంభం కాలేదు కాని… హైదరాబాద్‌లో ఈ సంస్కృతి విచ్చలవిడిగా ప్రారంభమైంది. ఆసుపత్రులలో రాత్రి పూట చేరితే అదనపు రుసుం వసూలు చేస్తున్నారు. ఇది 30 శాతం వరకు ఉంటుంది. కారణం అడిగితే రాత్రి విధులు నిర్వహించే సిబ్బందికి అదనపు వేతనాలు ఇస్తున్నామని చెబుతున్నారు. మెల్లగా ఇది మనకు వచ్చేసింది. మిగిలిన వారు కూడా అమలు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి.

అనుమతులివ్వాలి..

తక్కువ బెడ్‌లు ఉన్న వారికి కూడా అనుమతులు ఇస్తే సమస్యలు తగ్గుతాయి ప్రస్తుతం ఉన్న సమస్యలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయి… కనీసం పది బెడ్‌లు ఉన్న ఆసుపత్రికి కూడా ఇన్స్యూరెన్స్‌, ఆరోగ్యశ్రీ, ఆయుష్‌మాన్‌ భారత్‌ సదుపాయాలు, అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం… లేదంటే తెలంగాణాలో చోటు చేసుకుంటున్న పరిస్థితులు మనకు ఎంతో దూరంలో ఉండవు… చిన్న వారికి కూడా అనుమతులు ఇవ్వడం కారణంగా ప్రజలకు మెరుగైన వైద్యం, ప్రభుత్వాలకు తక్కువ ఖర్చుతో వైద్య చికిత్సలు అందుబాటులోకి వస్తాయి. ఫ్యామిలీ ఫిజిషియన్‌ వ్యవస్థ మళ్లీ బతుకుతుంది.

– డాక్టర్‌ నందకిషోర్‌, ఐఎంఎ అధ్యక్షుడు  

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *