నిజామాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఒకటి నుంచి 19ఏళ్ల వయస్సున్న ప్రతి ఒక్కరు నులిపురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలని జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి చెప్పారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రచార ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించి మాట్లాడారు. సాధారణంగా పిల్లలు కడుపునొప్పితో బాధపడుతుంటారు.. ఇలాంటి సమయంలో నిర్లక్ష్యం చేస్తే నులిపురుగులు పెరిగి రక్తహీనతకు, తీవ్రమైన కడుపునొప్పికి దారి తీస్తాయన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు సైతం సహకరించి పిల్లలకు తప్పనిసరి ప్రభుత్వం అందజేసే నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలని చెప్పారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ మాత్రలు ఉచితంగా అందజేస్తారని చెప్పారు. సంవత్సరంలో ఒక్కసారి ఈ మాత్రలు అందరూ ఒకే రోజు వాడడంతో నులిపురుగుల సమస్యను 100 శాతం నివారించవచ్చన్నారు. 19 ఏళ్లవారు మాకెందుకని నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా ఈ మాత్రలు అందజేస్తారని చెప్పారు. మొదటి రోజు మాత్రలు వేసుకోని వారు ఈ నెల 17న ఈ మాత్రలు వేసుకోవాలని చెప్పారు. ఈ ర్యాలీలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి సుదర్శనం, డిప్యూటీ డీఎంహెచ్వో తుకారాం రాథోడ్, సమన్వయ అధికారి రఘు, డాక్టర్ నాగరాజు, నర్సింగ్ విద్యార్థులు, వివిధ పాఠశాల విద్యార్థులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
నులి పురుగుల నివారణ మాత్రలు తప్పనిసరిగా వేసుకోవాలి
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]