[spt-posts-ticker]

నేటి నుంచి గాంధీలో కరోనా పరీక్షలు

 

దేశవ్యాప్తంగా కొత్తగా 12 చోట్ల ప్రారంభం
చైనా ప్రయాణికులను 14 రోజుల పాటు విడిగా పరిశీలన
ఉన్నతస్థాయి సమీక్షలో కేంద్ర సర్కారు వెల్లడి

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి) : సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రిలో శుక్రవారం నుంచి కరోనా పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన కిట్లను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా బెంగళూరులో 2, దిల్లీలో 2, ముంబయి, కేరళ, కోల్‌కతా, లఖ్‌నవూ, జైపుర్‌, నాగ్‌పుర్‌, చెన్నైల్లో ఒక్కోటి చొప్పున మొత్తంగా 12 చోట్ల కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షల నిర్వహణకు ఆమోదముద్ర వేసింది. తక్షణమే అన్ని చోట్లా పరీక్షల నిర్వహణ ప్రారంభమవుతుందని పేర్కొంది. కరోనా వైరస్‌ను అడ్డుకోవడంపై కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో గురువారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

అత్యవసరంగా అదనపు పడకలు
కరోనా వైరస్‌ అనుమానితుల కోసం హైదరాబాద్‌లో ఇప్పటికే 100 పడకలను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. కేరళలో తొలి కరోనా వైరస్‌ నమోదైన నేపథ్యంలో రాష్ట్రంలోనూ మరో 200 పడకలను సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో సిద్ధం చేయాలని నిర్ణయించింది. అత్యవసరంగా గాంధీ ఆసుపత్రిలో 10 పడకల ఐసీయూను సిద్ధం చేయాలని వైద్యఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులను గురువారం ఆదేశించారు. పుణెలోని వైరాలజీ ప్రయోగశాల, ఐసీఎంఆర్‌ సహకారంతో కరోనా నిర్ధారణ పరీక్షల నిర్వహణకు అవసరమైన శిక్షణ పొందాలని, సాధ్యమైనంత త్వరగా గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు ప్రారంభించాలని ఆదేశించారు. ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజల్లో వైరస్‌ నిరోధంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో 24 గంటల సేవల కోసం ప్రత్యేకంగా 04024651119 నంబరును అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. కేరళలో కరోనా తొలికేసు నమోదైన నేపథ్యంలో వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వైద్య సిబ్బందిని ఆదేశించారు.

వచ్చే వారంలోనే..
శుక్రవారం పరీక్ష కిట్లు వచ్చే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. అయితే వెంటనే పరీక్షలు చేయడానికి అవకాశముండదని తెలుస్తోంది. కిట్లను ఇక్కడి ప్రయోగశాలలో సన్నద్ధత చేసేందుకు నాలుగైదు రోజుల సమయం పడుతుందని, ఆ తర్వాతే గాంధీలో పూర్తిస్థాయిలో పరీక్షల నిర్వహణ సాధ్యపడుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. పుణెకు పంపించిన ఐదు నమూనాల ఫలితాలు ఇంకా వెల్లడవలేదు. వీటికి అదనంగా గురువారం మరో ఇద్దరి నమూనాలను పుణెకు పంపించారు.

ఆసుపత్రుల్లో ఇద్దరి చేరిక
నల్లకుంట, గాంధీ ఆసుపత్రి, న్యూస్‌టుడే: కరోనా లక్షణాలుగా భావించి గురువారం చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రిలో ఒకరు, నల్లకుంట ఫీవర్‌ ఆసుపత్రిలో మరొకరు చేరారు. వీరి నుంచి శాంపిళ్లు సేకరించి పుణెకు పంపారు. చైనా, హాంకాంగ్‌ తదితర దేశాల నుంచి వస్తున్న వారు జలుబు, జ్వరం, దగ్గు లాంటి లక్షణాలు కన్పిస్తే.. తక్షణం గాంధీ, ఫీవర్‌ ఆసుపత్రి వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇటీవల షాంఘై నుంచి వచ్చిన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ముగ్గురిని ఆసుపత్రిలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు.


ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివి…

* జనవరి 15వ తేదీ తర్వాత చైనా నుంచి వచ్చిన ప్రయాణికులందరికీ పరీక్షలు నిర్వహించడం.
* వారిని కనీసం 14 రోజుల పాటు ఇంటి వద్దే విడిగా ఉంచడంతో పాటు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరిశీలించడం.
* చైనాకు ప్రయాణాన్ని మానుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించడం.
*వ్యాధి లక్షణాలపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం
* నేపాల్‌ సరిహద్దు గ్రామాల నుంచి వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడంపై దృష్టి పెట్టడం.
* అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా 24 గంటల కంట్రోల్‌రూములను ఏర్పాటు చేయడం.
* ఆసుపత్రుల్లో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే నివారణ వస్తువులను సమకూర్చుకోవడం.

 

 

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *