[spt-posts-ticker]

కన్నతండ్రి కడతేర్చబోతే.. వైద్యులు ప్రాణం పోశారు

● దాడిలో గాయపడిన చిన్నారిని రక్షించిన వైద్యులు

● ఉస్మానియా ఆసుపత్రిలో శస్త్రచికిత్సతో పునర్జన్మ

హైదరాబాద్‌,(ఆరోగ్యజ్యోతి):ముక్కుపచ్చలారని చిన్నారి పాలిట కన్నతండ్రే కాలయముడై ప్రాణాలు తీయాలని భావించాడు. అప్పటికే పలుగుతో భార్యను హత్య చేసిన అతను.. అదే ఆవేశంలో పాపపై దాడి చేశాడు. తండ్రి కొట్టిన దెబ్బకు ఆ పసిప్రాణం  విలవిల్లాడింది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చుట్టుపక్కల వారు 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి.. అక్కడి నుంచి నిలోఫర్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అందించిన అక్కడి వైద్యులు.. అత్యవసర వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. శస్త్రచికిత్స చేసిన ఉస్మానియా వైద్యులు ఆ బాలికకు పునర్జన్మ ప్రసాదించారు. న్యూరో సర్జరీతోపాటు పూర్తిగా దెబ్బతిన్న దవడ ఎముకలను ప్లాస్టిక్‌ సర్జరీతో సరిచేశారు. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉందని ఉస్మానియా సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌ తెలిపారు.

అనుమానం పెంచుకుని..

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం రాందాస్‌తండాకు చెందిన మధు, అఖిల దంపతులకు 18 నెలల పాప ఉంది. బోరు మెకానిక్‌గా పని చేసే మధు భార్యపై అనుమానం పెంచుకోవడంతో తరచూ వాగ్వాగాలు జరిగేవి. జనవరి 29న ఇద్దరూ మళ్లీ గొడవపడ్డారు. ఆవేశంలో మధు పలుగుతో భార్యపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అదే ఆవేశంలో చిన్నారిపై దాడికి పాల్పడి.. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతలో పొలం నుంచి మధు తల్లితండ్రులు రావడంతో ఈ ఘోరం బయటకు తెలిసింది.

చావుబతుకుల్లో..

చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని జనవరి 30న ఉస్మానియా న్యూరో విభాగంలో చేర్పించారు. అక్కడ పలు చికిత్సలు అందించారు. అనంతరం ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి తరలించారు. చిన్నారి దవడ ఎముకలు విరిగి పోయి నోరు తెరుచుకోని పరిస్థితి నెలకొంది. మరోవైపు పుట్టినప్పుడే చిన్నారికి గుండె సమస్య కూడా ఉంది. ఈ క్రమంలో నేరుగా అనస్థీషియా ఇస్తే పాప ప్రాణాలకే ప్రమాదం. దీంతో ఈ ప్రక్రియను ఫైబర్‌ ఆప్టిక్‌ ఇంట్యూబేషన్‌- బ్రాంకోస్కోపీ గైడెడ్‌ పద్ధతిలో ముక్కు ద్వారా నిర్వహించారు. అనంతరం శస్త్రచికిత్స చేసి దవడ భాగాలను సరిచేశారు. ఈ చికిత్స కోసం దాదాపు 15 మంది వైద్య బృందం దాదాపు మూడు గంటలపాటు శ్రమించి.. విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిగా కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని డా.నాగేందర్‌ వివరించారు. తండ్రి క్షణికావేశం చివరికి ఆ పాపను అనాథగా మార్చేసింది.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *