న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో ప్రకటనల ఆదాయం ఆగిపోయిన నేపథ్యంలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న వార్తా పత్రికలు కేంద్ర ప్రభుత్వం జోక్యాన్ని కోరాయి. తమ పరిశ్రమను ఆదుకోవాలని, మనుగడ సాగించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. పత్రికలకు రెండేళ్ల పాటు పన్ను రాయితీ ప్రకటించాలని, న్యూస్‌ప్రింట్ మీద దిగుమతి సుంకం ఎత్తేయాలని విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి, ప్రకటనల ఆదాయం పడిపోవడం, న్యూస్ ప్రింట్ మీద కస్టమ్స్ సుంకం… ఇలా మూడు వైపుల నుంచి వార్తా పత్రికల మీద కోలుకోలేని దెబ్బ పడిందని వివరించింది. గతంలో ఎన్నడూ ఊహించని ఈ పరిస్థితితో దేశీయ పత్రికారంగం త్వరలోనే కుప్పకూలే వాతావరణం కనబడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పత్రికల సమస్యలపై ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వానికి విన్నవించామని ఐఎన్ఎస్ గుర్తు చేసింది.తాజా లేఖను సమాచార ప్రసార శాఖ కార్యదర్శి రవి మిత్తల్‌కు పంపింది. లాక్డౌన్ తర్వాత ప్రకటనల ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, దానికి తోడు నిర్వహణ వ్యయం పెరిగిపోయిందని, న్యూస్‌ప్రింట్ దిగుమతి సుంకం భరించలేని స్థాయికి పెరిగిపోయిందని ఐఎన్ఎస్ వివరించింది. ఖర్చు తగ్గించుకొనే కార్యక్రమంలో భాగంగా వార్తా పత్రికలు పేజీలను బాగా తగ్గించాయని, ఆదివారం అనుబంధాలను ప్రధాన పత్రికల్లో కలిపేశాయని, అయినా, రోజురోజుకూ నష్టాలు పెరిగిపోతూనే ఉన్నాయని తెలిపింది. ఇతర నిత్యావసర వస్తువులైన ఆహారం, పాలు, సరుకులు కొనేటప్పుడు వాటి పూర్తి వ్యయాన్ని వినియోగదారుడు చెల్లిస్తాడని, వార్తా పత్రికలు మాత్రం నామమాత్రపు మొత్తాన్నే చందాదారుల నుంచి వసూలు చేస్తున్నాయని ఐఎన్ఎస్ వెల్లడించింది. ప్రకటనల ఆదాయం ద్వారా వార్తా పత్రికలు ఈ గ్యాప్‌ను పూడ్చుకొనేవని, ఇప్పుడు ప్రకటనలు లేకపోవడం వల్ల తీవ్ర సంక్షోభం ఏర్పడిందని వివరించింది. చిన్న, మధ్య స్థాయి పత్రికలు చాలావరకు ప్రింటింగ్ ఆపేశాయని, పెద్ద పత్రికలు కూడా తీవ్ర సంక్షోభంలో ఉన్నాయని తెలిపింది. పత్రికారంగం కుప్పకూలితే దేశీయ న్యూస్‌ప్రింట్ తయారీ పరిశ్రమ కూడా సంక్షోభంలో పడుతుందని హెచ్చరించింది. అంతేకాకుండా, పెద్ద సంఖ్యలో పత్రికల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, అనుబంధ పరిశ్రమలు, ముద్రణ పరిశ్రమలు, పంపిణీ వ్యవస్థలు, వార్తా పత్రికల అమ్మకందారులు, డెలివరీ బాయ్స్ జీవితాలు ప్రభావితం అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.
పత్రికలను ఆదుకోవాలి!
[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]