అనంతపురం(ఆరోగ్యజ్యోతి) : పల్లె ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలను స్థానికంగానే ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆరోగ్య ఉపకేంద్రాల్లో అధునాతనంగా ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ ద్వారా నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నారు. కాగా ఇప్పటివరకు పీహెచ్సీ, సీహెచ్సీలలో మాత్రమే మెరుగైన వైద్య సేవలు అందించేవారు. ఆరోగ్య ఉపకేంద్రాలు కేవలం సూదులు వేయడానికి, మందుల పంపిణీకి ఉపయోగపడుతూ వచ్చేవి. అయితే ఇప్పుడు ఆరోగ్య ఉపకేంద్రాల్లోనూ గ్రామీణ ప్రజలకు వైద్యసేవలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదికూడా ఆన్లైన్ ద్వారా ప్రత్యేక వైద్య నిపుణుల సలహాలు తీసుకుని రోగులకు వైద్య చికిత్స చేయనున్నారు. ఈ నూతన సేవలకు జిల్లా వైద్యశాఖ శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఇప్పటికే పీహెచ్సీలలో టెలీమెడిసిన్ సేవలు అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 87 పీహెచ్‌సీలు ఉండగా, అందులో 50 పీహెచ్సీలలో అమలుచేస్తున్నారు. తాజాగా జిల్లాలోని 298 ఆరోగ్య ఉపకేంద్రాల్లోనూ టెలీమెడిసిన్ సేవలు అందించాలని రాష్ట్రశాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఆ మేరకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అనిల్‌కుమార్ చర్యలు వేగవంతం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకం నిధుల ద్వారా ఈ సేవలు అందించనున్నారు.
12 రకాల వైద్య సేవలు
ఈ ఆరోగ్య సంరక్షణ వికాస కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రజలకు 12 రకాల వైద్యసేవలు అందించనున్నారు. సాధారణ జబ్బులతో పాటు బీపీ, మధుమేహం, రక్తహీనత, హిమోగ్లోబిన్, వివిధ రకాల కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి కేంద్రానికి మిడ్‌లెవల్ ఆరోగ్య ప్రొవైడర్‌ను నియమించారు. ఈ ఎంఎల్‌హెచ్‌పీలే ఈ కేంద్రాలలో సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అదికూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి.
తిరుపతి నుంచి వైద్య నిపుణుల సలహాలు
పల్లె ప్రజలు వివిధ వ్యాధులతో బాధపడుతూ దూరప్రాంతాలకు వచ్చి మెరుగైన వైద్యసేవలు పొందలేక అనేక అవస్థలు పడుతుంటారు. అలాంటి రోగులకు ఈ టెలీమెడిసిన్ సేవల ద్వారా వైద్య నిపుణులతో సలహాలు తీసుకుని ఆరోగ్య ఉపకేంద్రాల్లోనే సేవలందించనున్నారు. రాయలసీమ స్థాయిలో తిరుపతిలో టెలీమెడిసిన్ హబ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అక్కడ అన్ని విభాగాల వైద్యనిపుణులు ఉంటారు. ఆన్లైన్లో రోగికి సంబంధించిన వ్యాధి వివరాలను నమోదు చేసి తిరుపతి టెలీమెడిసిన్ హబ్‌కు పంపాలి. ఆ వివరాల ప్రకారం సంబంధిత వైద్యనిపుణులు అందుబాటులోకి వచ్చి ఆ రోగికి ఉన్న వ్యాధి, ఎలాంటి చికిత్స అందించాలి వంటి వివరాలను ఆన్లైన్లోనే తెలియజేస్తారు. ఆ మేరకు ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఉన్న సిబ్బంది సంబంధిత రోగికి వైద్యసేవలు అందిస్తారు. మరోవైపు బీపీ, మధుమేహం, ఈసీజీ, హిమోగ్లోబిన్, జ్వరం, రక్త, మూత్రపరీక్షల ఫలితాల ఆధారంగా తిరుపతి టెలీమెడిసిన్ హబ్ నుంచి వైద్య చికిత్స అందించనున్నారు.
రేకులకుంటలో ప్రారంభం
ఆరోగ్య ఉపకేంద్రాల్లో టెలీమెడిసిన్ సేవలు బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట ఉపకేంద్రంలో ప్రారంభించారు. అక్కడ అవసరమైన వసతులు, సిబ్బందిని ఏర్పాటు చేసి సేవలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని మిగిలిన 297 ఆరోగ్య ఉపకేంద్రాలకు త్వరలో ఈ సేవలు విస్తరించనున్నట్లు డీఎంహెచ్ఓ అనిల్‌కుమార్ తెలిపారు. ఈ సేవలు పల్లె ప్రజలకు ఎంతో ఉపయోగమని, సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Advertisement