[spt-posts-ticker]

పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో ప్రజలు

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): కొవిడ్‌-19 నగరంలో పంజా విసురుతున్నది. దినదినం బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. కంటికి కనిపించని మహమ్మారి ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా సోకుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వ్యాధి సోకినా ఎలాంటి లక్షణాలు కనిపించక పోవడంతో తలలు పట్టుకుంటున్నారు. సోమవారం గ్రేటర్‌ పరిధిలో ముగ్గురు డాక్టర్లకు, ఇద్దరు పోలీసులకు, ఇద్దరు జీహెచ్‌ఎంసీ సిబ్బందికి, జర్నలిస్టుకు, డ్వాక్రాగ్రూప్‌ మహిళలకు, మాజీ ఎంపీ కుమారుడి ఇంట్లో ముగ్గురు పనిమనుషులకు పాజిటివ్‌ వచ్చింది. ఇదిలా ఉండగా ఒకరు మృతి చెందారు.కరోనా మహమ్మారి నగరంలో కమ్ముకుంటున్నది. నిన్నమొన్నటి వరకు ఒక మూలకు మాత్రమే పాజిటివ్‌ కేసులు నమోదుకాగా రోజురోజుకూ చాపకింద నీరులా నగరం నలుమూలలకు విస్తరిస్తున్నది. లాక్‌డౌన్‌ సడలింపులతో నగరంలో జనసంచారం పెరిగిపోయింది. అదే స్థాయిలో కరోనా సైతం ప్రబలుతూనే ఉన్నది. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాస్కులు, భౌతిక దూరం, శానిటైజ్‌ వంటి నిబంధనలు మరిచి కనీస భద్రత చర్యలు పాటించకుండా విచ్చలవిడిగా సంచరిస్తూనే ఉన్నారు. ఇందుకు నిన్న రాంనగర్‌ చేపల మార్కెట్‌, నేడు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే కరోనా కాటేస్తుందనే విషయాన్ని ప్రజలు ఇప్పటికైనా గ్రహించి స్వీయనియంత్రణ పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం నాల్గవ అంతస్తులోని ఘనవ్యర్థాల నిర్వహణ విభాగంలో పనిచేసే ఓ జూనియర్‌ అసిస్టెంట్‌కు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఉద్యోగికి కరోనా సోకిందనే వార్త తెలియడంతో సోమవారం ఒక్కసారిగా కార్యాలయంలో కలకలం రేపింది. వెంటనే కమిషనర్‌ నాల్గవ అంతస్తులో ఉద్యోగులను ఖాళీ చేయించి మొత్తం విభాగంలో క్రిమి సంహారక రసాయనాలు పిచికారీ చేయించారు. వివరాల్లోకి వెళితే.. రాంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి(33) సాలిడ్‌ వేస్ట్‌ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సదరు ఉద్యోగికి జ్వరం రావడంతో 5వ తేదీ నుంచి విధులకు హాజరు కావడంలేదు.

సోమవారం ఉన్నతాధికారులు సదరు ఉద్యోగి విధులకు హాజరు కాకపోవడంపై వాకబు చేయగా, అతడికి ఆదివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గాంధీ దవాఖానలో చేరినట్లు తేలింది. దీంతో వెంటనే కార్యాలయాన్ని శానిటైజ్‌చేసి కార్యాలయానికి వచ్చిపోయే వారికి థర్మల్‌ టెస్టింగ్‌ ప్రారంభించారు. అలాగే, శానిటైజేషన్‌ చర్యలు మరింత ముమ్మరం చేశారు. సందర్శకులు మాస్కు తప్పనిసరిగా ధరించడంతోపాటు చేతులు శానిటైజ్‌ చేసుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేశారు. రోజూ వందల సంఖ్యలో సందర్శకులు వచ్చే ఈ కార్యాలయంలో ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ రావడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.

[su_button url="https://wa.me/917013260176?text=Hi" background="#007a09"]Whatsapp me [/su_button]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *